ఏదో జరిగింది: ఎన్నికలపై అయ్యన్న సందేహాలు

By Nagaraju penumalaFirst Published May 29, 2019, 12:44 PM IST
Highlights

రాష్ట్రంలో తాము చేసిన అభివృద్ధికి కనీసం 50, 60 సీట్లు అయినా రావా? అని కార్యకర్తలతో అన్నారు. ఎక్కడో ఏదో జరిగిందని లేకపోతే ఇంతలా ఓడిపోమన్నారు. ఇది కేవలం తన అభిప్రాయం మాత్రమే కాదని ప్రతీ ఒక్కరి అభిప్రాయమన్నారు. 

నర్సీపట్నం: రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ఫలితాలపై మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పలు సందేహాలు వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఏదో జరిగిందని లేకపోతే టీడీపీకి ఇంత ఘోరమైన పరిస్థితా అంటూ విస్మయం వ్యక్తం చేశారు. 

రాష్ట్రంలో తాము చేసిన అభివృద్ధికి కనీసం 50, 60 సీట్లు అయినా రావా? అని కార్యకర్తలతో అన్నారు. ఎక్కడో ఏదో జరిగిందని లేకపోతే ఇంతలా ఓడిపోమన్నారు. ఇది కేవలం తన అభిప్రాయం మాత్రమే కాదని ప్రతీ ఒక్కరి అభిప్రాయమన్నారు. 

ఎన్నికల్లో ఓటమిపై టీడీపీ అధినేత చద్రబాబు ఆవేదన చూసి తాను తట్టుకోలేకపోయానని స్పష్టం చేశారు. మరోవైపు తెలంగాణలో బీజేపీ గెలిచిన నాలుగు ఎంపీ స్థానాల్లో కూడా ఏదో జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. 

బీజేపీ గెలిచిన నాలుగు స్థానాల్లో ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ పేపర్ తో రీ పోలింగ్ నిర్వహించాలని సవాల్ విసిరారు. బీజేపీ గెలిచిన నాలుగు ఎంపీ స్థానాల్లో కరపత్రాలు పంపిణీ చేసేందుకు కార్యకర్తలు కూడా లేరని అలాంటిది అక్కడ ఎలా గెలిచిందో అర్థం కావడం లేదన్నారు. 

కార్యకర్తలు లేని చోట్ల బీజేపీ గెలవడంపై సందేహం ఉందన్నారు. ఎక్కడో ఏదో జరిగిందని లేకపోతే దేశవ్యాప్తంగా మోదీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ 300పైచిలుకు సీట్లు రావడం ఏంటని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 

ఇకపోతే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అయ్యన్నపాత్రుడు సైతం ఘోరంగా ఓడిపోయారు. తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి, ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ సోదరుడు పెట్ల ఉమా శంకర్ గణేష్ చేతిలో ఓటమిపాలయ్యారు. 
 

click me!