
ఢిల్లీ : వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన మీద..తనపై తప్పుడు కేసులు బనాయించి కస్టడీలోనే అంతమొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణలు గుప్పించారు. సీఎం జగన్, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, సైబరాబాద్ సిపీ స్టీఫెన్ రవీంద్రలతో తనకు ప్రాణహాని ఉందన్నారు. కాపాడాలని పార్లమెంటు సభ్యులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన వారందరికీ ఒక లేఖ కూడా రాశారు. ‘ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రతీకారేచ్ఛతో అధికారాలను దుర్వినియోగం చేస్తున్నాడు. సీఐడీ పోలీసులతో నాపై రాజద్రోహం కేసు మోపారు. కస్టడీలోకి తీసుకుని హింసించారు. ఈ హింసను హైదరాబాద్ మిలటరీ ఆస్పత్రి ధ్రువీకరించింది. అయినా, కప్పి పుచ్చుకునేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నించింది.
కట్టు కథలు అల్లుతోంది. లెక్కకు మిక్కిలి కేసులు బనాయిస్తూ ఉండడంతో 30 నెలలుగా నేను నా నియోజకవర్గానికి వెళ్లడానికి కుదరలేదు. ఆయా కేసుల్లో ఇప్పటికే 12 స్టేలు ఉన్నాయి. నాకు పొంచి ఉన్న ముప్పును గుర్తించి కేంద్ర హోంశాఖ రెండేళ్ల కిందట వై కేటగిరి భద్రత కల్పించింది. ఫిబ్రవరి 26న నాపై ఒక పోలీసు రెక్కీ నిర్వహించారు. నాకు భద్రతగా ఉన్న సిఆర్పిఎఫ్ సిబ్బంది గుర్తించి అతడిని పోలీసులకు అప్పగించారు. అతనిపై పోలీసులు ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదు.
కానిస్టేబుల్ మీద దాడి : ఎంపీ రఘురామపై కేసు, భద్రతా సిబ్బందిపై సస్పెన్షన్ వేటు...
జూలై 3న నేను భీమవరం వెళ్లేందుకు రైలు బోగి బుక్ చేసుకున్నా. రైలులోనే నాపై దాడి జరిగే అవకాశం ఉందని నాకు సమాచారం అందింది. ఏపీ ఇంటిలిజెన్స్ పోలీసులుగా చెప్పుకుంటున్న ఇద్దరిని సీఆర్పీఎఫ్ సిబ్బంది రైలులో పట్టుకుని నన్ను కాపాడారు. దాంతో నేను పక్క స్టేషన్లో దిగిపోయాను. నేను ఇంటికి వెళ్ళాక నెంబరు లేని కారు నా ఇంటి చుట్టు తిరుగుతోందని రక్షణ సిబ్బంది గమనించారు. మా ఇంటి సిసి కెమెరాల్లో రికార్డ్ అయింది. ఈ ఫుటేజీ కోసం ప్రయత్నిస్తే ఆ ఫుటేజ్ ఇవ్వొద్దని గచ్చిబౌలి ఎస్హెచ్ఓ చెప్పారని మా గేటెడ్ కమ్యూనిటీ సెక్యూరిటీ హెడ్ తెలిపారు. ఇది ఏపీ పోలీసులకు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర కు ఉన్న సాన్నిహిత్యాన్ని తెలియజేస్తుంది’.
స్టీఫెన్ రవీంద్ర జగన్ సన్నిహితుడు
‘అల్లూరి విగ్రహావిష్కరణకు ప్రధాని నరేంద్ర మోడీ జూలై 4న భీమవరం వచ్చారు. ప్రోటోకాల్ ప్రకారం నేను కూడా ప్రధానిని ఆహ్వానించాలి. కానీ, నేను భీమవరం వెళ్ళకుండా ఏపీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టించింది, అదే రోజున నా ఇంటి వద్ద తచ్చాడుతున్న ఒకరిని సిఆర్పిఎఫ్ సిబ్బంది పట్టుకున్నారు. అతడిని ప్రశ్నిస్తే తొలుత సమాచారం చెప్పేందుకు నిరాకరించాడు. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా ముందు తాను ఏపీ ఇంటిలిజెన్స్ కానిస్టేబుల్ అని, ఐడి కార్డు మర్చిపోయానని తెలిపాడు. అతడిని సిఆర్పిఎఫ్ సిబ్బంది గచ్చిబౌలి పోలీసులకు అప్పజెప్పారు. పోలీస్ స్టేషన్కు వెళ్లాక అతను సీఆర్పీఎఫ్ సిబ్బంది తనను బలవంతంగా అపహరించాడని, దూషించారని, నేను నా కుమారుడు సీఆర్పీఎఫ్ సిబ్బంది ఫైబర్ లాఠీలతో కొట్టారు. అని తప్పుడు ఫిర్యాదు చేశాడు. వాస్తవానికి ఆ సమయంలో నేను ఢిల్లీకి వెడుతున్నా. గచ్చిబౌలి పోలీసులు నాతోపాటు నా కుమారుడు, సిఆర్పిఎఫ్ సిబ్బందిపై కేసులు పెట్టారు. ఇది ఏపీ సీఎం జగన్ సన్నిహితుడు సిపి స్టీఫెన్ రవీంద్ర ద్వారా తెలంగాణ-ఆంధ్ర పోలీసుల సాహిత్యానికి నిదర్శనం’
సిఆర్పిఎఫ్ నైతికతను దెబ్బ తీసేలా ‘ఏపీ ఇంటిలిజెన్స్ కానిస్టేబుల్ తన బంగారు ఉంగరాన్ని సీఆర్పీఎఫ్ సిబ్బంది దొంగిలించారు అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో సీఆర్పీఎఫ్ సిబ్బంది ప్రాణాలను లెక్కించారు. అలాంటి వారి మీద తప్పుడు ఆరోపణలు ప్రభుత్వాలు అనుమతిస్తే వారి నైతిక స్థైర్యం దెబ్బతింటుంది. అప్పుడు ఎవరు మనల్ని రక్షించలేదు. రాజకీయ ప్రేరణతో రాజేంద్రనాథ్రెడ్డి నా మీద తప్పుడు కేసులు పెడుతున్నారు. నన్ను అంతం చేయాలని ప్రయత్నిస్తున్నారు. నాకు కల్పించిన భద్రతను రద్దు చేయించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే సీఆర్పీఎఫ్ సిబ్బందిపై తప్పుడు కేసులు పెట్టారు. ఇలాంటి విధానాన్ని జగన్ నాయకత్వంలోని పోలీసులు సీబీఐ అధికారి రామ్ సింగ్ మీద కూడా ప్రయత్నించారు. న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉన్న నేను ఈ అడ్డంకులను న్యాయస్థానాల్లో ఎదుర్కొంటా. రూ. 43వేల కోట్ల అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న సీఎం జగన్ నిర్దేశ పూర్వక వైఖరికి వ్యతిరేకంగా మీ మద్దతు కోరుతున్నాను’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.