Andhra Pradesh By Election Result 2022: భారీ ఆధిక్యంలో వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి..

By Sumanth KanukulaFirst Published Jun 26, 2022, 10:15 AM IST
Highlights

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఫలితాల్లో వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి భారీ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు.

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఫలితాల్లో వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి భారీ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. తొలి రౌండ్ నుంచి వైసీపీ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. 7వ రౌండ్ ముగిసేసరికి మేకపాటి విక్రమ్ రెడ్డి.. తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్‌పై 25 వేలకు పైగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దీంతో వైసీపీ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి. మరోవైపు బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ కౌంటింగ్ హాలు నుంచి వెళ్లిపోయారు. 

7వ రౌండ్ ముగిసేసరికి ఫలితాలు..
విక్రమ్ రెడ్డి (వైసీపీ)- 31,474
భరత్ కుమార్ (బీజేపీ)- 5,168
ఓబులేసు (బీఎస్పీ)- 1,105
నోటా- 1,341

ఇదిలా ఉంటే.. ఆత్మకూరు ఉపఎన్నిక బరిలో 14 మంది అభ్యర్థులు నిలిచారు. వైసీపీ అభ్యర్థిగా గౌతమ్‌ రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్‌రెడ్డి పోటీచేస్తున్నారు. బీజేపీ అభ్యర్థిగా భరత్‌కుమార్, బీఎస్పీ అభ్యర్థిగా న్యాయవాది ఓబులేసు, మరో 11 మంది పోటీలో ఉన్నారు. మేకపాటి కుటుంబ సభ్యులకే టిక్కెట్ ఇచ్చినందున.. గత సంప్రదాయాన్ని పాటించి ఉప ఎన్నికకు దూరంగా ఉంటున్నట్లు టీడీపీ ప్రకటించింది. 

ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్ జూన్ 23న జరిగగా.. గతంలో కంటే ఓటింగ్ శాతం తక్కువగా నమోదైంది. గతంలో ఆత్మకూరు‌‌లో 82.44 శాతం పోలింగ్ నమోదు కాగా.. తాజాగా అక్కడ 64.26 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. గతంతో పోలిస్తే ఓటింగ్ శాతం 18.18 శాతం తగ్గింది. 

ఇక, ఆత్మకూరు నియోజకవర్గంలో మేకపాటి గౌతమ్ రెడ్డి రెండుసార్లు వైసీపీ నుంచి బరిలో నిలిచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో ఆయన 31 వేలకు పైగా ఆధిక్యం సాధించగా.. 2019లో 22 వేల ఓట్లకు పైగా ఆధిక్యంతో గెలుపొందారు. అయితే ఈ ఉప ఎన్నికల్లో విక్రమ్ రెడ్డి మెజారిటీ లక్షకు పైగా ఉండాలని వైసీపీ భావించింది. ఈ క్రమంలోనే పలువురు మంత్రులు ఆత్మకూరులో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అయితే పోలింగ్ శాతం తక్కువగా ఉండటంతో.. వైసీపీ లక్ష మెజారిటీ సాధించడం కష్టంగానే కనిపిస్తోంది. 
 

click me!