టీడీపీ పథకాలు, యాప్ లను .. జగన్ రెడ్డి ప్రభుత్వం కాపీ కొడుతోంది : అచ్చెన్న

By AN TeluguFirst Published Jun 30, 2021, 10:32 AM IST
Highlights

టీడీపీ హయాంలోని పథకాలనే కాదు.. యాప్ లను కూడా జగన్ రెడ్డి ప్రభుత్వం కాపీ కొడుతోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఫోర్త్ లయన్ యాప్ ను కాపీ కొట్టి దిశ యాప్ పేరుతో హడావుడి చేస్తోందన్నారు.

టీడీపీ హయాంలోని పథకాలనే కాదు.. యాప్ లను కూడా జగన్ రెడ్డి ప్రభుత్వం కాపీ కొడుతోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఫోర్త్ లయన్ యాప్ ను కాపీ కొట్టి దిశ యాప్ పేరుతో హడావుడి చేస్తోందన్నారు.

దిశ చట్టం కాకుండానే జగన్ యాప్ ను ఆవిష్కరించడం సిగ్గుచేటన్నారు. మహిళలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రెండేళ్ల పాలనలో మహిళల మీద 500కు పైగా దాడులు, అఘాయిత్యాలు జరిగాయని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. 

కాగా, విజయవాడ: యువతులు, మహిళల భద్రత కోసం ‘దిశ’ యాప్‌ తీసుకొచ్చామని..దీనితో కలిగే మేలును ప్రతి ఇంటికీ తెలియజేయాల్సిన అవసరముందని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. ఇటీవల ప్రకాశం బ్యారేజీ వద్ద జరిగిన ఘటన తన మనసును కలచివేసిందని చెప్పారు. 

విజయవాడ శివారు గొల్లపూడిలో మహిళా పోలీసులు, వాలంటీర్లతో ‘దిశ’ యాప్‌పై నిర్వహించిన అవగాహన సదస్సులో సీఎం మాట్లాడారు. దిశ యాప్‌ను ఎంత ఎక్కువగా డౌన్‌లోడ్‌ చేయించగలిగితే అంతగా అక్క చెల్లెమ్మలకు అది తోడుగా నిలుస్తుందన్నారు. 

ఈ యాప్‌ దేశవ్యాప్తంగా 4 అవార్డులు సాధించిందని చెప్పారు. ఇప్పటికే 17లక్షల డౌన్‌లోడ్లు జరిగాయన్నారు. స్మార్ట్‌ఫోన్‌ ఉన్న ప్రతి యువతి, మహిళ దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో కనీసం కోటి మంది మహిళల మొబైళ్లలో దిశ యాప్‌ ఉండేలా చర్యలు చేపడుతున్నామని జగన్‌ చెప్పారు. 

మహిళలు తమ మొబైల్‌లో దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుంటే అన్న తోడుగా ఉన్నట్టే భావించవచ్చని సీఎం అన్నారు. అనుకోని ఘటన ఎదురైనపుడు యాప్‌లోని ఎస్‌వోఎస్‌ బటన్‌ నొక్కితే నిమిషాల్లో పోలీసులు ఆ ప్రదేశానికి చేరుకుంటారని.. యాప్‌ ద్వారా బాధితులు ఉన్న లొకేషన్‌ వివరాలు నేరుగా కంట్రోల్‌ రూం, పోలీస్‌స్టేషన్‌కు చేరేలా పటిష్ఠమైన కార్యాచరణ రూపొందించామన్నారు.

ఇప్పటికే పోలీస్‌ గస్తీ వాహనాలను పెంచామని.. మరిన్ని పెంచుతామని చెప్పారు. దిశ యాప్‌ వాడుకపై మహిళల్లో అవగాహన కల్పించాలని మహిళా పోలీసు సిబ్బంది, వాలంటీర్లకు జగన్‌ సూచించారు. అక్కచెల్లెమ్మలకు మేలు చేసే విషయంలో తమ ప్రభుత్వం ఎప్పుడూ వెనకడుగు వేయదన్నారు.
 

click me!