సీఎం, డీజీపీలు ఉన్న ప్రాంతాల్లోనే ఇలాంటి దారుణమా?: అచ్చెన్నాయుడు ఫైర్

By Arun Kumar PFirst Published Jan 14, 2021, 12:54 PM IST
Highlights

దేవాలయాలపై దాడులు రాజకీయ క్రీడతో జరుగుతున్నాయని సీఎం జగన్ రెడ్డి.. ఎటువంటి కుట్రకోణం లేదని డీజీపీ చెప్పే విధానాన్ని చూస్తే ప్రజలకు అనుమానం కలుగుతోందన్నారు అచ్చెన్నాయుడు. 

అమరావతి: సంక్రాంతి పండుగనాడే గుంటూరు జిల్లాలోని భ్రమరాంబ ఆలయంలో చోరీ జరగడం దురదృష్టకరమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు
 అన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.  ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది అద్దం పడుతోందని ఆరోపించారు. 

''దేవాలయాలపై దాడులు రాజకీయ క్రీడతో జరుగుతున్నాయని సీఎం జగన్ రెడ్డి.. ఎటువంటి కుట్రకోణం లేదని డీజీపీ చెప్పే విధానాన్ని చూస్తే ప్రజలకు అనుమానం కలుగుతోంది. దాడులు చేసిన నేరస్తులను పట్టుకోకుండా పంచెకట్టుతో దేవాలయాల నిర్మాణానికి శంకుస్థాపన చేసినంత మాత్రానా జగన్ హిందూ మత పరిరక్షకులు కాలేరు'' అని అన్నారు.

''దేవుళ్ళకే రక్షణ లేని పాలనలో ప్రజలకు రక్షణ వుంటుందా? నిరంతరం జరుగుతున్న వరస సంఘటనలపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపి దుండగులను శిక్షించాలి. ప్రతిపక్షంపై నెట్టి చేతులు దులుపుకొనే ప్రయత్నం చెయ్యడం భాధ్యతా రాహిత్యం. దేవాలయాలపై దాడులు చేసిన 347 మందిని అరెస్టు చేశామని డీజీపీ అంటున్నారు. దోషులను ప్రజల ముందు ఎందుకు నిలబెట్టలేదు?'' అని నిలదీశారు.

read more   రామతీర్థం ప్రధాన ఆలయంలో ఏమీ జరగలేదు: ఏపీ డీజీపీ గౌతం సవాంగ్

''రాష్ట్రాభివృద్ధిని చూసి ప్రతిపక్షానికి కడుపు మంటగా ఉందని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. విగ్రహాల విధ్వంసమేనా మీరు చెప్పే అభివృద్ధి? దాడులపై చంద్రబాబు పోరాడే వరకు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారు? సమస్యలపై ప్రజల దృష్టి మళ్లించేందుకు మీ కనుసన్నల్లోనే దాడులు జరుగుతున్నాయన్నది వాస్తవం కాదా?'' అని ప్రశ్నించారు.

''వైసీపీ ప్రభుత్వానికి పోయే కాలం దగ్గర పడి ఇష్టానురీతిగా వ్యవహరిస్తోంది. బడుల మీద కూడా దాడులు జరగబోతున్నాయని నెల్లూరు సభలోనే జగన్ రెడ్డి సంకేతం ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, దళితులు, బీసీలు, దేవతల మీద దాడులు అయిపోయి రానున్న కాలంలో బడులపై దాడులు ఏ విధంగా చేయాలో ప్రణాళికను సిద్ధం చేసినట్లు ఉన్నారు. ఇష్టమొచ్చినట్లు పాలన చేస్తామంటే ప్రజలు కాల గర్భంలో కలుపుతారు. ముఖ్యమంత్రి, డీజీపీలు ఉన్న ప్రాంతాల్లోనే దేవాలయాలకు రక్షణ లేదంటే ఇతర ప్రాంతాల్లో పరిస్థితి ఏంటి?'' అంటూ అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

click me!