కర్నూల్ టిడిపి నేతల హత్యల వెనుక... వైసిపి ఎమ్మెల్యే కాటసాని హస్తం?: అచ్చెన్నాయుడు సంచలనం

Arun Kumar P   | Asianet News
Published : Jun 17, 2021, 02:02 PM IST
కర్నూల్ టిడిపి నేతల హత్యల వెనుక... వైసిపి ఎమ్మెల్యే కాటసాని హస్తం?: అచ్చెన్నాయుడు సంచలనం

సారాంశం

రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా ఏ స్థాయికి దిగజారిందో, ప్రజాస్వామ్యం ఎలా అపహాస్యమవుతుందో తెలుసుకోడానికి కర్నూల్ హత్యోదంతమే ప్రత్యక్ష సాక్ష్యమని ఏపీ టిడిపి అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. 

గుంటూరు: జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో ప్రజల ప్రాణాలకు భద్రత కరువైంది... హత్యలు, విధ్వంసాలు నిత్యకృత్యమయ్యాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు రాష్ట్రాన్ని రావణకాష్ఠంగా మారుస్తున్నారని... రాజకీయ కక్షతో టీడీపీ నేతలు, కార్యకర్తలను బలికొంటున్నారని మండిపడ్డారు. 

''కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం గడివేముల మండలం పెసరవాయిలో టీడీపీ నేత, మాజీ సర్పంచ్ వడ్డి నాగేశ్వరరెడ్డి, సహకారసంఘం మాజీ అధ్యక్షుడు వడ్డి ప్రతాపరెడ్డి ని ప్రత్యర్థి వర్గం కారుతో ఢీకొట్టి, వేట కొడవళ్లతో నరికి దారుణంగా హతమార్చారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. వారి కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది'' అని అచ్చెన్న ధైర్యం చెప్పారు. 

''జగన్మోహన్ రెడ్డి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. అభివృద్ధిని గాలికొదిలేసి కక్షలు, కార్పణ్యాలతో కాలం వెళ్లదీస్తున్నారు. టీడీపీ నేతలు తమ కుటుంబసభ్యులతో కలిసి బంధువు ఇంట్లో  కార్యక్రమానికి వెళ్లి తిరిగి వెళ్లుండగా ప్రత్యర్థులు మాటు వేసి హత్య చేశారు. ఈ దారుణం వెనుక  వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి'' అంటూ అచ్చెన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. 

read more  కబడ్దార్... మూల్యం చెల్లించుకోక తప్పదు: టిడిపి నాయకుల హత్యపై చంద్రబాబు సీరియస్

''రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా ఏ స్థాయికి దిగజారిందో, ప్రజాస్వామ్యం ఎలా అపహాస్యమవుతుందో ఈ హత్యోదంతమే ప్రత్యక్ష సాక్ష్యం. ఈ రెండేళ్లో 30 మందికి పైగా టీడీపీ నేతలను పొట్టనుపెట్టుకున్నారు. వందలాది తెలుగుదేశం శ్రేణులపై దాడులు చేశారు. ప్రజల ప్రాణాలను రక్షించాల్సిన పోలీసులు ఏం చేస్తున్నారు? పట్టపగలే ఉన్మాదులు ఇలా రెచ్చిపోతుంటే కళ్లప్పగించి చూడటానికా మీరు ఉన్నది?  ఖాకీ డ్రెస్ తీసేసి వైసీపీ కండువా కప్పుకోండి'' అని మండిపడ్డారు. 

''కర్నూల్ టిడిపి నాయకులు హత్యకు పోలీసులు, ప్రభుత్వానిదే బాధ్యత. మీ అరాచకాలను లెక్కపెడుతున్నాం. అధికారంలోకి వచ్చాక ఇంతకు ఇంత బదులు తీర్చుకుంటాం'' అని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. 

 
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్