జగనే సిఎం: ప్రమాణానికి ముహూర్తం కూడా పెట్టేసిన జ్యోతిష్యులు ఎవరంటే..

By Nagaraju penumalaFirst Published Apr 30, 2019, 4:58 PM IST
Highlights

దేవనాడీ జ్యోతిష్యులు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని తేల్చేశారు. అంతేకాదు మే 26 ప్రమాణ స్వీకారానికి శుభదినమని అంటూ ముహూర్తం సైతం పెట్టేశారు ప్రముఖ శ్రీరామనాడీ జ్యోతిష్యులు మురపాక కాళిదాసుశర్మ. 

విజయనగరం: ఏపీలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినా టెన్షన్ మాత్రం రోజురోజుకు ఎక్కువ అవుతోంది. విజయం ఏ పార్టీని వరిస్తుందా అంటూ సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఫలితాలు వెలువడేందుకు 23 రోజులు ఉండటంతో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని అధికార పార్టీ తెలుగుదేశం, ఈసారి తామే అధికారంలోకి వస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీలకు ఆ పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. 

అయితే ఇరు పార్టీలు సీఎం కుర్చీ తమదంటే తమదని వాదులాడుకుంటున్నాయి. అంతేకాదు పలువురు జ్యోతిష్యులు, పండితులు మీదంటే మీదే అధికారం అంటూ చెప్పుకొస్తున్నారు. తాజాగా దేవనాడీ జ్యోతిష్యులు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని తేల్చేశారు. 

అంతేకాదు మే 26 ప్రమాణ స్వీకారానికి శుభదినమని అంటూ ముహూర్తం సైతం పెట్టేశారు ప్రముఖ శ్రీరామనాడీ జ్యోతిష్యులు మురపాక కాళిదాసుశర్మ. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయని వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని తెలిపారు. 

ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేసేందుకు మే 26 అనుకూలదినం అంటూ ఆయన ప్రకటించారు. శ్రీ విద్యా సర్వమంగళాదేవి పీఠంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అవకాశాలు మెండుగా ఉన్నట్లు కాలచక్రగమనం స్థితిగతులు స్పష్టం చేస్తున్నాయన్నారు. 

వైసీపీ అధికారంలోకి రావాలని కోరుతూ మార్చి 27  నుంచి ఏప్రిల్ 12 వరకు అంటే 17 రోజులపాటు నీలాపతాకసహిత రాజశ్యామల యాగం నిర్వహించినట్లు తెలిపారు. వైఎస్ జగన్ చేతులమీదుగా వరుణ ప్రధానం తీసుకుని యాగాన్ని దిగ్విజయంగా ముగించినట్లు తెలిపారు. 

తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అఖండ విజయం సాధిస్తుందని ఎనిమిదినెలల ముందే దేవనాడీ కాల చక్ర గ్రహగతుల బట్టి తెలపడం అనంతరం అదే రుజువు అయ్యిందని తెలిపారు. అలాగే ఏపీలో వైఎస్ జ గన్ సీఎం కావడం ఖాయమని తెలిపారు. 

జగన్ జన్మనక్షత్రం రోహిణితోపాటు పార్టీ ఆవిర్భావ దినం ఆరుద్ర నక్షత్రాల మేళవింపుతో ముహూర్తాన్ని నిర్ణయించినట్లు తెలిపారు. ఆ రెండు నక్షత్రాల బలాల పరిశీలన అనంతరం మే 26న ఉదయం తొమ్మిదిగంటల 20 నిమిషాల సప్తమీ తత్కాల అష్టమీ ఆదివారం శుభ ముహూర్తంగా నాడీ జ్యోతిష్యం చెప్తోందని తెలిపారు. 

వేదపండితులు, పీఠాధిపతులు, విజ్ఞులు ఎవరైనా ప్రమాణ ముహూర్తాన్ని నిర్ణయించినట్లైతే రెండు నక్షత్రాల మేళవింపును పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. పరిపాలించే రాజు మంచి ముహూర్తంలో బాధ్యతలు స్వీకరిస్తే దక్షత పెరగడంతోపాటు రాష్ట్రం సుభిక్షంగా ఉండేందుకు సకల గ్రహాల అనుకూలత ఉంటుందన్నారు. 

సనాతన ధర్మంలో చక్రవర్తులు, రాజులు ఈ మేరకే బాధ్యతలు చేపట్టేవారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా వైసీపీకి 107 నుంచి 115 మధ్య సీట్లు రావచ్చని తెలిపారు. ఇకపోతే ఈ ముహూర్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ పెట్టించినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ముహూర్తం హల్ చల్ చేస్తోంది. 

click me!