మా సమస్యలపై చర్చే లేదు.. కేబినెట్ సబ్ కమిటీలో కొందరికీ ఏం తెలియదు : ఉద్యోగ నేత బొప్పరాజు వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Apr 5, 2023, 7:09 PM IST
Highlights

మంత్రివర్గ ఉపసంఘంలో కొందరికి తమ సమస్యలపై అవగాహన లేదన్నారు ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు. ఉపసంఘం తమ సమస్యలు చర్చించలేదని.. కొన్ని వ్యాధులకు కవరేజ్ లేదంటూ ఆస్పత్రులు వైద్యం నిరాకరిస్తున్నాయని బొప్పరాజు ఫైరయ్యారు. 

మంత్రివర్గ ఉపసంఘం తమ సమస్యలు చర్చించలేదన్నారు ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాము ఇచ్చిన మెమోరాండంపై మంత్రివర్గ ఉపసంఘం చర్చించలేదన్నారు. జీపీఎఫ్, మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులు నెలాఖరుకల్లా చెల్లిస్తామన్నారని బొప్పరాజు గుర్తుచేశారు. మంత్రివర్గ ఉపసంఘంలో కొందరికి తమ సమస్యలపై అవగాహన లేదని.. ఉద్యోగుల ఆరోగ్య పథకం గురించి మొత్తం వివరాలు చెప్పామని వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఉద్యోగుల ఆరోగ్య పథకానికి సకాలంలో డబ్బు చెల్లించడం లేదని.. నిధులను ట్రస్ట్ ద్వారా నేరుగా ఆస్పత్రికి పంపాలని కోరామని ఆయన పేర్కొన్నారు. కొన్ని వ్యాధులకు కవరేజ్ లేదంటూ ఆస్పత్రులు వైద్యం నిరాకరిస్తున్నాయని బొప్పరాజు ఫైరయ్యారు. 

తమ ప్రధాన సమస్యలు ఎప్పుడు పరిష్కరిస్తారని వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. జీతాలు 1వ తేదీన పడితే చాలనే పరిస్థితికి ఉద్యోగులు వచ్చారని ఆయన ఎద్దేవా చేశారు. జీతం ఏ తేదీన పడుతుందో స్పష్టంగా చెప్పాలని.. జీతం 1వ తేదీన రాకుంటే ఈఎంఐలు, ఇంటి ఖర్చులు ఎలా చెల్లించాలని వెంకటేశ్వర్లు నిలదీశారు. రికమెండ్ చేసిన పే స్కేల్స్ ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. 2015 నాటి కరస్పాండెన్స్ పే స్కేల్ మాత్రమే ఇప్పుడు ఇస్తున్నారని బొప్పరాజు ఫైర్ అయ్యారు. ఉద్యోగులకు పే స్కేల్ ఇవ్వకుంటే ఇక కమిషన్ ఎందుకు అని ఆయన నిలదీశారు. ఈ పే స్కేల్ వల్ల 2018 తర్వాత చేరినవారు అందరూ నష్టపోతారని.. పే స్కేల్ మారిన తర్వాతే ఎరియర్స్ లెక్క కట్టాలన్నారు. 

Latest Videos

ALso Read: మా డబ్బును మేం అడుగుతుంటే.. కాకి లెక్కలేంటీ : జగన్‌ సర్కార్‌పై బొప్పరాజు ఆగ్రహం

సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమ బద్దీకరణ వెంటనే చేపట్టాలని వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. సచివాలయాల్లో మహిళా కార్యదర్శులను మహిళా పోలీసుల పేరుతో వేధిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపటి నుంచి ఈ నెల 29 వరకూ నల్ల బ్యాడ్జీలు ధరించి వివిధ రూపాలలో ఆందోళనలు నిర్వహిస్తామని బొప్పరాజు స్పష్టం చేశారు. మే లో జోనల్ స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తామని.. అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే చలో విజయవాడ నిర్వహిస్తామని వెంకటేశ్వర్లు హెచ్చరించారు. 

click me!