
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నప్పుడు అప్పులు చేయడం సహజమన్నారు. ఎన్టీఆర్ హయాంలో 2 రూపాయలకే కిలో బియ్యాన్ని అందించడంతో ప్రభుత్వంపై భారం పడిందన్నారు. ఇప్పుడు తాము కూడా పేదలకు ప్రభుత్వ సొమ్ముతో సంక్షేమ పథకాలను అందిస్తున్నామని... కానీ విపక్షనేతలు కావాలనే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కోలగట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తున్నామని, అందుకే ధైర్యంగా ప్రజల మధ్యలోకి వెళ్తున్నామన్నారు. వాగ్థానాలు అమలు చేయనందునే చంద్రబాబు ఎన్నికల్లో ఓడిపోయారని, చివరికి ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయారని వీరభద్రస్వామి గుర్తుచేశారు. సీఎం జగన్‌కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేకే విపక్షనేతలు రాద్ధాంతం చేస్తున్నారని డిప్యూటీ స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతకుముందు సోమవారంనాడు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. టిక్కెట్టు నిరాకరించడం వెనుక కారణాలుంటాయని సీఎం జగన్ చెప్పారు. ఎమ్మెల్యే టిక్కెట్టు నిరాకరించిన వారికి అవకాశాలు కల్పిస్తామని ఏపీ సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే టిక్కెట్టు ఇవ్వకపోతే ఎమ్మెల్సీ పదవి లేదా కార్పోరేషన్ చైర్మెన్లుగా నియమిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ALso Read: విభేదాలను పరిష్కరించే బాధ్యత మీదే .. రీజనల్ కో ఆర్టినేటర్లకు జగన్ దిశానిర్దేశం
2029 లో నియోజకవర్గాల్లో పునర్విభజన జరుగుతుందని సీఎం జగన్ చెప్పారు. దీంతో రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. 2029లో పెరిగిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో అవకాశం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. పెండింగ్ బిల్లులన్నీ ఈ నెలలోనే క్లియర్ చేస్తానని .. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసినవారు మన బటన్ బ్యాచ్ కాదని సీఎం జగన్ పేర్కొన్నారు. గతంలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో గ్రేడింగ్ ఇచ్చిన జగన్ ఈసారి మాత్రం గ్రేడింగ్ ఇవ్వలేదు.