ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధనకు సంబంధించి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ రెడ్డి క్రైస్తవుడు అయ్యి ఉండి మణిపూర్ ఘటన మీద స్పందించలేదని, మణిపూర్‌లో 2 వేల చర్చిల మీద దాడులు జరిగితే ఒక్క రోజు కూడా విమర్శ చేయలేదని ఆమె మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధనకు సంబంధించి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం షర్మిల మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా వస్తే.. ఉద్యోగాలు, పరిశ్రమలు వచ్చేవన్నారు. హోదా రావడం అనడం కంటే పాలకులు తీసుకురాలేకపోయారని అనడం కరెక్ట్ అంటూ షర్మిల ఎద్దేవా చేశారు. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి హోదా రావడం వల్ల 2 వేల కొత్త పరిశ్రమలు వచ్చాయని, 500 శాతం కొత్త ఉద్యోగాలు వచ్చాయన్నారు. హిమాచల్ ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల 10 వేల కొత్త పరిశ్రమలు వచ్చాయని షర్మిల తెలిపారు. మరి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఎందుకు రావడం లేదని ఆమె ప్రశ్నించారు.
రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ 5 ఏళ్లు హోదా ఇస్తామని అంటే బీజేపీ 10 ఏళ్లు ఇవ్వాలని ఊదరగొట్టారని షర్మిల ఎద్దేవా చేశారు. 10 ఏళ్లు కాదు 15 ఏళ్లు హోదా కావాలని చంద్రబాబు అన్నారని.. అందుకే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని షర్మిల గుర్తుచేశారు. మోడీ కేబినెట్‌లో మంత్రి పదవులు తీసుకుని, సీఎం అయ్యాక హోదాను పక్కనపెట్టి ఉద్యమం చేసే వాళ్ల మీద కేసులు పెట్టారని ఆమె దుయ్యబట్టారు. జగన్ రెడ్డి ప్రతిపక్షనేతగా వున్నంత కాలం రోజూ హోదా అన్నారని, విపక్షంలో వున్నప్పుడు కేంద్రంపై అవిశ్వాసం పెడతానని అన్నారని షర్మిల గుర్తుచేశారు. టిడిపి మద్దతు ఇస్తే ..మూకుమ్మడి గా రాజీనామాలు చేస్తే ఎందుకు రాదు హోదా అన్నారని ఆమె ఎద్దేవా చేశారు.
జగన్ రెడ్డి సీఎం అయ్యాక ఒక్కసారి కూడా ఉద్యమం చేయలేదని, స్వలాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలను వైసీపీ తాకట్టు పెట్టిందని వైఎస్ షర్మిల ఆరోపించారు. ప్రత్యేక హోదా కాదు కదా.. కనీసం ఒక్క ప్యాకేజీ కూడా లేదని, ఈ పాపం ముమ్మాటికీ చంద్రబాబు ది..జగన్ రెడ్డిదని ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక అమరావతి రాజధాని అన్న చంద్రబాబు .. సింగపూర్ చేస్తానని 3D గ్రాఫిక్స్ చూపించారని షర్మిల మండిపడ్డారు.
ఇక జగన్ రెడ్డి మూడు రాజధానులు అని.. మూడు కాదు కదా ఒక్క రాజధాని కూడా లేదన్నారు. మన రాజధాని ఏది అంటే మనకే తెలియదని.. ఇదేనా చంద్రబాబు,జగన్ రెడ్డి సాధించిన అభివృద్ధి అని షర్మిల ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్ట్ ను ప్రారంబించింది వైఎస్సార్ అని.. ఆయన ఉన్నప్పుడు కుడి ఎడమ కాలువలు పూర్తి చేశాడరని ఆమె తెలిపారు. వైఎస్సార్ చనిపోయాక ఒక్క అడుగు ముందుకు పడలేదని.. బీజేపీతో దోస్తీ కోసం చంద్రబాబు , జగన్‌లు పోలవరాన్ని తాకట్టు పెట్టారని షర్మిల ఎద్దేవా చేశారు.
బీజేపీ అధికారంలో 10 ఏళ్లు ఉండి...ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిందని , ఇందులో ఏపీకి ఎన్ని ఉద్యోగాలు వచ్చాయని ఆమె ప్రశ్నించారు. కొత్త ఉద్యోగాలు కాదు కదా... ఉన్న ఉద్యోగాలు ఊడి పోయే పరిస్థితి వుందని, ఆంధ్రలో ఒక లక్ష ఉద్యోగాలు కూడా బీజేపీ ఇవ్వలేక పోయిందన్నారు. దేశంలో బీజేపీ అధికారంలో ఉండి రైతులను మోసం చేసిందని.. అప్పు లేని రైతు దేశంలో ఎక్కడా లేడని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. స్విస్ బ్యాంక్ నుంచి డబ్బు వెనక్కు తెచ్చి రైతుల అకౌంట్‌లో వెస్తామని బీజేపీ చెప్పిందని, ఒక్క రైతు ఖాతాలో అయినా డబ్బులు పడ్డాయా అని ఆమె ప్రశ్నించారు. ఆంధ్ర రాష్ట్రాన్ని బీజేపీ మోసం చేస్తుంటే...టీడీపీ, వైసీపీ ఎందుకు తొత్తులుగా మారాయని షర్మిల నిలదీశారు.
రాష్ట్రంలో ఉన్న 25 మంది ఎంపీలు బీజేపీ చెప్పుచేతల్లో ఉన్నారని.. ప్రజలు బీజేపీకి ఓటు వేయకపోయినా టీడీపీ, వైసీపీ ఎంపీలు బీజేపీ గుప్పిట్లో ఉన్నారని ఆమె పేర్కొన్నారు. బీజేపీ చేతుల్లో ఉన్నప్పుడు ఎంపీ ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి, వైసీపీకి ఓటు ఎందుకు వేయాలని షర్మిల ప్రశ్నించారు. బీజేపీకి అమ్ముడుపోవడానికి వైసీపీ , టీడీపీల నుంచి ఎందుకు పోటీ పెట్టాలని ఆమె నిలదీశారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా టీడీపీకి, వైసీపీకి పొత్తు ఉందని షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే నిజం...లేకుంటే 5 ఏళ్లలో వైసీపీ ఎందుకు బీజేపీనీ విమర్శ చేయలేదో చెప్పాలని షర్మిల ప్రశ్నించారు.
జగన్ రెడ్డి క్రైస్తవుడు అయ్యి ఉండి మణిపూర్ ఘటన మీద స్పందించలేదని, మణిపూర్‌లో 2 వేల చర్చిల మీద దాడులు జరిగితే ఒక్క రోజు కూడా విమర్శ చేయలేదని ఆమె మండిపడ్డారు. క్రైస్తవుల మనోభావాలు దెబ్బతింటూ ఉంటే స్పందించలేదని షర్మిల ఫైర్ అయ్యారు. టిడిపి సైతం అదే వైఖరిలో వుందని, వైఎస్సార్ బీజేపీ పార్టీకి వ్యతిరేకి అని ఆమె గుర్తుచేశారు.
బీజేపీ మతతత్వ పార్టీ అని.. మతం పేరుతో చిచ్చు పెట్టాలి.. చలి కాచుకోవాలి.. ఇదే బీజేపీ మంత్రమన్నారు. వైఎస్సార్ ఆశయాలు ఒక్క కాంగ్రెస్‌లోనే నెరవేరాయని, వైఎస్సార్‌ను ప్రేమించే ప్రజలు ఆయన ఆశయాల కోసం నిలబడదామని షర్మిల పిలుపునిచ్చారు. వైఎస్సార్ బిడ్డతో చేతులు కలపాలని.. ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ వైఎస్సార్ ఆశయాలను సిద్దింపజేద్దామన్నారు.