
YSRCP's 13th foundation day celebrations: తిరుగులేని విజయంతో కాంగ్రెస్ పార్టీని రెండుసార్లు అధికారంలోకి తీసుకువచ్చిన దింగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో (2009 సెప్టెంబరు 2న) ప్రాణాలు కోల్పోయిన తర్వాత.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్తానం మొదలుపెడుతూ.. వైఎస్సార్సీపీని స్థాపించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధనే లక్ష్యంగా, రాష్ట్ర సమగ్రాభివృద్ధే ధ్యేయంగా 2011 మార్చి 11న వైఎస్సార్‌సీపీ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే నేడు వైఎస్సార్సీపీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆ పార్టీ సీనియర్ నాయకులు, ఎంపీ విజయ సాయి రెడ్డి మాట్లాడుతూ తమ పార్టీ తెలుగు నాట సరికొత్త విప్లవానికి నాంది పలికిందని తెలిపారు.
మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి అమలు చేసిన పథకాల బాటలో సాగాలన్న దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. వైయస్సార్ కాంగ్రెస్‌పార్టీని స్థాపించి నేటికి 13 సంవత్సరాలు అయిందని విజయసాయి రెడ్డి అన్నారు. తమ పార్టీ లక్ష్యాన్ని చేరుకోవటమే కాకుండా, అంతకు మించి మరో నాలుగు అడుగులు ముందుకు వేయటం కనిపిస్తోందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల కోసం పార్టీ పనిచేస్తోందనీ, అందరి సంక్షేమమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. "నేడు వైఎస్సార్సీసీ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, ఓసీ నిరుపేదల పార్టీ.. ఈ పార్టీ సామాజిక న్యాయానికి, మహిళా–విద్యా–రాజకీయ–ఆర్థిక సాధికారతలకు దేశంలోనే చుక్కాని!.." అని ఆయన తెలిపారు.
తాము ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో సంపూర్ణ విజయం దిశగా ముందుకు సాగుతున్న పార్టీ అని విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. "ఇది రైతన్నలు, పల్లెలు, నిరుపేదలను ప్రేమించే నాయకుడి పార్టీ! ఇది మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించి 98.5 శాతం వాగ్దానాల్ని అమలు చేసిన నాయకుడి పార్టీ!.." అని ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ఎన్నో సంస్కరణలు అమలు చేసి సరికొత్త చరిత్రను లిఖించిన పార్టీగా వైఎస్సార్సీపీని ఆయన అభివర్ణించారు. "ఇది గ్రామ స్వరాజ్యం నుంచి జిల్లాల పునర్‌విభజన వరకు పరిపాలన సంస్కరణలు చేసిన నాయకుడి పార్టీ! ఇది ప్రాంతాలకు న్యాయం కోసం వికేంద్రీకరణను సిద్ధాంతంగా ఆచరిస్తున్న పార్టీ. ఇది తెలుగునాట మరో పారిశ్రామిక విప్లవానికి నాందీపలుకుతున్న దార్శనికుడి పార్టీ.." అని తెలిపారు.
రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి అండగా ఉంటూ.. భావితరాలకు భరోసాగా వైఎస్సార్సీపీ నిలుస్తోందని పేర్కొన్నారు. "జగన్‌గారి నాయకత్వానికి అర్థం... మారిన గ్రామం, మారుతున్న సామాజిక చిత్రం, రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబానికీ అండ! ఆయన నేటి తరానికి ఆలంబన– భావితరానికి భరోసా.." అని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.