ఏపీలో కాంగ్రెస్‌కు మెల్లమెల్లగా ఆదరణ, మద్దతు పెరుగుతున్నదని తెలుస్తున్నది. రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్రకు అందిన విరాళాల్లో ఏపీ టాప్ ప్లేస్‌లో నిలిచింది.
YS Sharmila: 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా తుడిచిపెట్టేసుకుపోయింది. కొత్త రాష్ట్రంలో టీడీపీ మినహా మరే బలమైన పార్టీ లేని స్థితిని వైసీపీ ఫిల్ చేసింది. కాంగ్రెస్ ఓటు బ్యాంక్‌నే వైసీపీ కొల్లగొట్టిందని చెబుతారు. రెండు పర్యాయాలు ఏపీలో కేవలం టీడీపీ వర్సెస్ వైసీపీగానే రాజకీయాలు సాగాయి. నిన్నా మొన్నటి వరకు కూడా అదే లెక్క. కానీ, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు తీసుకున్నాక వేరే లెక్క.. అనేలా పరిస్థితులు మారుతున్నాయి.
ఇప్పుడు ప్రజల్లో టీడీపీ, వైసీపీ నేతలతో పోటీగా షర్మిల కనిపిస్తున్నారు. మీడియాలోనే ఆమె పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. వాస్తవానికి వైసీపీ చీఫ్ జగన్ పై టీడీపీ, జనసేన చేసే వ్యాఖ్యల కంటే కూడా షర్మిల చేస్తున్న విమర్శలకు ఎక్కువ పాపులారిటీ వస్తున్నది. నిన్నా మొన్నటి వరకు ఉనికిలో లేని కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు బలమైన శక్తిగా అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ముందుకు వస్తున్నది. కానీ, ఈ వాదన నిజమేనా? అని చెప్పడానికి ఆధారాలేవీ ఇప్పటి వరకు లేవు. ఎందుకంటే షర్మిల బాధ్యతలు తీసుకున్నాక ప్రజా పరీక్ష ఇంకా రానేలేదు. కానీ, ఒక కొత్త విషయం కాంగ్రెస్ బలపడ్డదన్న వాదనలకు బలాన్ని చేకూరుస్తున్నది.
Also Read: Evil: ఏపీలోని ఆ గ్రామంలో భయానక అదృశ్య శక్తి? తెల్లార్లు మెలకువతోనే యువత కాపలా.. అసలేం జరుగుతున్నది?
రాహుల్ గాంధీ రెండో విడత భారత్ జోడో యాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర పూర్తి చేసిన ఆయన తాజాగా మణిపూర్ నుంచి ముంబయి వరకు భారత్ జోడో న్యాయ్ యాత్ర చేపడుతున్నారు. ఈ యాత్ర కోసం దేశవ్యాప్తంగా ప్రజా విరాళాలను కాంగ్రెస్ కోరుతున్నది.
అనూహ్యంగా పబ్లిక్ డొనేషన్‌లలో ఏపీ టాప్‌లో నిలిచింది. నిన్నా మొన్నటి వరకు లీడర్, క్యాడర్ కనిపించని ఈ పార్టీ నుంచి దేశంలోనే అత్యధికంగా భారత్ జోడో న్యాయ్ యాత్ర కోసం విరాళాలు రావడం ఒకింత ఆశ్చర్యాన్నే కలిగిస్తున్నది. ఇది పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణను చూపిస్తున్నదనే వాదనలకు బీజం వేసింది.
Also Read: TDP: టీడీపీకి ఘోర పరాభవం.. 41 ఏళ్లలో తొలిసారి పెద్ద సభలో టీడీపీ నిల్
తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జీ, ఎంపీ మాణిక్కం ఠాగూర్ సోమవారం ఈ వివరాలను వెల్లడించారు. భారత్ జోడో న్యాయ్ యాత్రకు అత్యధిక విరాళాలు అందించిన టాప్ 5 రాష్ట్రాల వివరాలు తెలిపారు. అందులో రూ. 1.02 కోట్లతో ఏపీ టాప్‌లో ఉన్నది. ఆ తర్వాత వరుసగా రాజస్తాన్, హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటకలు నిలిచాయి.
ఏపీలో కాంగ్రెస్‌కు ప్రజల ఆదరణ, మద్దతు పెరుగుతున్నదని మాణిక్కం ఠాగూర్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపినందుకు వైఎస్ షర్మిలను ప్రశంసించారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఈ విషయంపై ఎక్స్ వేదికగా స్పందించారు. న్యాయ్ విరాళాల్లో టాప్‌లో నిలిచిన ఏపీ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని ఇది నిరూపిస్తున్నదని, ఏపీ ప్రజలకు కాంగ్రెస్ పార్టీనే ఆశాకిరణంగా ఉన్నదని పేర్కొన్నారు. ఇది మొదలు అని.. అచంచల విశ్వాసంతో రాష్ట్రం కోసం కృషి చేస్తామని తెలిపారు.