మనిషిని చంపుతుంటే స్పందించకుండా చోద్యం చూస్తున్నాం :పవన్ ఆవేదన

By Nagaraju TFirst Published Sep 27, 2018, 2:36 PM IST
Highlights

 రాష్ట్రంలో ఉపాధ్యాయుల బతుకులు బానిస బతుకులయిపోయాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ప్రజాపోరాట యాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ ను 13 జిల్లాలకు చెందిన ఉపాధ్యాయ సంఘాల నేతలు కలిశారు. టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఉపాధ్యాయులు పవన్ కు వివరించారు. 
 

ఏలూరు: రాష్ట్రంలో ఉపాధ్యాయుల బతుకులు బానిస బతుకులయిపోయాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ప్రజాపోరాట యాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ ను 13 జిల్లాలకు చెందిన ఉపాధ్యాయ సంఘాల నేతలు కలిశారు. టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఉపాధ్యాయులు పవన్ కు వివరించారు. 

ప్రభుత్వాలు విద్యావ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశాయని పవన్ ఆరోపించారు. టీచర్లకు ప్రస్తుత సమాజంలో విలువలేదన్నారు. ప్రస్తుత విద్యావ్యవస్థ స్పందన లేని సమాజాన్ని తయారు చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులను గురుబ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర అనే స్థాయి నుంచి బానిస స్థాయికి తీసుకువచ్చారని మండిపడ్డారు.  

పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు పాఠశాలలకు విద్యార్థులను తీసుకురావడం ఏంటని ప్రశ్నించారు. బతకలేక బడిపంతులు అన్న నానుడిని ప్రభుత్వం నిజం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకమనిషిని చంపుతున్నప్పుడూ జనం చుట్టూ చేరి చోద్యం చూస్తున్నారంటే స్పందన లేని సమాజం అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

ప్రస్తుతం అన్ని రంగాల్లో వ్యాపార ధోరణి ఎక్కువ అయిపోయిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తూ, ఉపాధ్యాయుల భర్తీ చేయకుండా ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేయడంతోనే ప్రైవేట్ విద్యాసంస్థలకు విద్యార్థులు క్యూ కడుతున్నారని మండిపడ్డారు. 

click me!