ఇలాగయితే చంద్రబాబు ఇలాకాలో ప్రజా ఉద్యమం తప్పదు: అచ్చెన్నాయుడు

By Arun Kumar PFirst Published Oct 26, 2020, 6:40 PM IST
Highlights

ప్రజల హక్కుల్ని కాపాడండి, ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించండి అంటూ చేసే పాదయాత్రలను పోలీసులతో అడ్డుకోవడం, అక్రమంగా నిర్బంధించడం ప్రభుత్వ అభద్రతా భావానికి నిదర్శనమని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. 

గుంటూరు: హంద్రీ-నీవా ద్వారా సాగు, తాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ నేతలు చేపట్టిన పాదయాత్రను పోలీసులతో అడ్డుకోవడం ప్రభుత్వ అభద్రతా భావానికి నిదర్శనమని ఏపీ టిడిపి అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. తెలుగుదేశం అధికారంలో ఉండగా కుప్పం కంటే ముందు పులివెందులకు నీళ్లిచ్చామని... 13 జిల్లాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికతో పనిచేశామని పేర్కొన్నారు. కానీ జగన్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమాన్ని కూడా ఒక వర్గానికి పరిమితం చేసి వివక్షకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 

''నాడు జగన్ రెడ్డి చేసిన పాదయాత్రకు సహకరించాం. మేం కూడా ఇప్పుడు మీరు వ్యవహరిస్తున్నట్లు వ్యవహరిస్తే పాదయాత్ర చేసేవారా? నేడు ప్రతిపక్ష నాయకులు ప్రజల హక్కుల్ని కాపాడండి, ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించండి అంటూ చేసే పాదయాత్రలను పోలీసులతో అడ్డుకోవడం, అక్రమంగా నిర్బంధించడం ప్రభుత్వ అభద్రతా భావానికి నిదర్శనం. రాష్ట్ర ప్రజల హక్కులను కూడా కాలరాస్తూ నియంతృత్వ విధానాలను అనుసరించడం సిగ్గుచేటు'' అని మండిపడ్డారు. 

''ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో ఏ ఒక్కరూ సంతోషంగా ఉండకూడదు అనేలా జగ్లక్ వ్యవహరిస్తున్నారు. అమరావతికి భూములిచ్చిన రైతులు తమకు న్యాయం చేయమని దాదాపు ఏడాదిగా ఉద్యమిస్తుంటే కనీసం పట్టించుకోకపోగా.. పోలీసు బూటు కాళ్లతో తన్నించారు. ఇసుక ధరలు తగ్గించండి అంటూ రోడ్డెక్కితే అరెస్టులు చేశారు. సొంతూళ్లలో ఉండనివ్వకుండా తరిమేస్తున్నారని ప్రశ్నిస్తే వేధించారు. అడుగడుగునా రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కుతూ ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదంలా జగ్లక్ రెడ్డి దాపురించారు'' అంటూ విరుచుకుపడ్డారు. 

''హంద్రీనీవాపై ప్రతిపక్షంలో ఉండగా అన్ని రకాలైన ప్రగల్భాలు పలికిన జగన్ రెడ్డి నేడు నీళ్లివ్వమంటూ పాదయాత్ర చేస్తే ఎందుకు అడ్డుకుంటున్నారు.? జగన్ రెడ్డికి పరిపాలన చేతకాదు. ప్రజల సంతోషంగా ఉంటే పట్టదు. ప్రశ్నిస్తే అణచివేయడమే ధ్యేయంగా వ్యవహరించడం జగన్ రెడ్డి అభద్రతా భావానికి, వికృత రాజకీయాలకు నిదర్శనం. 24 గంటల్లో హంద్రీ-నీవా నుండి కుప్పం నియోజకవర్గానికి నీళ్లివ్వకుంటే ప్రజా ఉద్యమం ఎదుర్కోవాల్సి ఉంటుందని గుర్తుంచుకో'' అని సీఎం జగన్ ను హెచ్చరించారు. 
 

click me!