ఉద్యోగాలిమ్మని అడిగితే అత్యాచారం కేసులా?: జగన్ సర్కార్ పై అచ్చెన్న ఆగ్రహం

By Arun Kumar PFirst Published Jun 30, 2021, 5:02 PM IST
Highlights

ఉద్యోగాలివ్వకుండా మోసం చేసి... చివరకు నిలదీసిన నిరుద్యోగులపై ఏకంగా అత్యాచారం కేసులు నమోదు చేయడం తుగ్లక్ విధానం కాక మరేమిటి అంటూ సీఎం జగన్ పై అచ్చెన్నాయుడు విరుచుకుపడ్డారు. 
 

అమరావతి: అధికారంలోకి వస్తే ఉద్యోగాల విప్లవం తీసుకొస్తాం.. సునామీ సృష్టిస్తామని ఎన్నికల సమయంలో జగన్ రెడ్డి ఊదరగొట్టారని ఏపీ టీడీపీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి అరెస్టులు చేయడం, తప్పుడు కేసులు పెట్టడం తప్ప సాధించిందేమిటి? అని ప్రశ్నించారు. ఉద్యోగాలివ్వకుండా మోసం చేసి... చివరకు నిలదీసిన నిరుద్యోగులపై ఏకంగా అత్యాచారం కేసులు నమోదు చేయడం తుగ్లక్ విధానం కాక మరేమిటి అంటూ అచ్చెన్న విరుచుకుపడ్డారు. 

''రెండున్నర లక్షల ఉద్యోగాలిస్తామని ఊరించి.. రెండేళ్ల తర్వాత 10వేల ఉద్యోగాలిస్తామంటారా? అది కూడా వచ్చే ఏడాది పాటు నోటిఫికేషన్లు ఇస్తూ పోతామనడం నిరుద్యోగుల్ని మోసం చేయడం కాదా? ఉద్యోగాల పేరుతో నాడు పాదయాత్రలో, ఎన్నికల ప్రచారంలో హోరెత్తించి రెండేళ్లు నోరు మెదపలేదు. రెండేళ్ల తర్వాత కూడా నోటిఫికేషన్ ఇవ్వడం చేతకాలేదు. పత్రికల్లో భారీ ప్రకటనలతో జాబ్ క్యాలెండర్ అంటూ.. జాబ్ లెస్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగుల్ని ముంచారు. మాట ఇవ్వడం మడమ తిప్పడంలో జగన్ రెడ్డిని మించిన వారు ప్రపంచంలోఎవరూ ఉండరు, ఉండకూడదు అనేంతలా మోసం చేస్తున్నారు'' అని మండిపడ్డారు. 

read more  ఐఏఎస్ శ్రీలక్ష్మికి కోర్టు ఝలక్.. ఖర్చులకు డబ్బులు కట్టమంటూ ఆదేశాలు..

''ఉద్యోగాల పేరుతో చేసిన మోసాన్ని ప్రశ్నించిన నిరుద్యోగులు, విద్యార్ధులపై అత్యాచారం కేసులు పెట్టిన ప్రభుత్వం.. దాడులు, దౌర్జన్యాలు, అత్యాచారాలకు పాల్పడిన వైసీపీ నేతలపై కేసులు పెట్టకపోవడంపై ఏం సమాధానం చెబుతారు.? ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం.. ప్రజలపై తప్పుడు కేసులు పెట్టడమే ధ్యేయంగా పని చేయడం సిగ్గుచేటు. ఇప్పటికైనా ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ లెస్ క్యాలెండర్ పై పున:సమీక్షించి.. ఎన్నికల హామీ మేరకు 2.30లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి. హామీ అమలు చేయనందుకు నిరుద్యోగులకు క్షమాపణలు చెప్పి ముఖ్యమంత్రి తక్షణమే రాజీనామా చేయాలి'' అని అచ్చెన్న డిమాండ్ చేశారు. 

వైసిపి ప్రభుత్వం యువతకు చేస్తున్న మోసాన్ని ప్రజలకు వివరిస్తామన్నారు. ఉద్యోగార్ధులతో కలిసి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగుల ఉద్యమం చూడాల్సి వస్తుందని జగన్ సర్కార్ ను అచ్చెన్నాయుడు హెచ్చరించారు. 

click me!