దొరికితే జనం కొడతారని.. విమాన యాత్రలు చేస్తారేమో : మంత్రుల బస్సు యాత్రపై అచ్చెన్నాయుడు సెటైర్లు

By Siva KodatiFirst Published May 20, 2022, 2:27 PM IST
Highlights

త్వరలో జరగనున్న వైసీపీ మంత్రుల బస్సు యాత్రపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సెటైర్లు వేశారు. దొరికితే ప్ర‌జ‌లు వెంట‌బ‌డి కొడ‌తారని త్వ‌ర‌లో విమాన యాత్ర‌లు కూడా చేస్తార‌ంటూ ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు యాత్రకు వస్తోన్న స్పందన చూసి జగన్‌కు భయం పట్టుకుందన్నారు. 

వైసీపీ ప్ర‌భుత్వంపై, ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ ఏపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు (atchannaidu) మరోసారి మండిప‌డ్డారు. ఈసారి మ‌హానాడును ప్ర‌కాశం జిల్లా మండువవారి పాలెంలో రెండు రోజుల పాటు నిర్వ‌హించ‌నున్న నేప‌థ్యంలో ఆయ‌న శుక్రవారం మీడియాతో మాట్లాడారు. మ‌హానాడుకు పోటీగా వైసీపీ బ‌స్సు యాత్ర‌లు చేస్తోంద‌ని అచ్చెన్నాయుడు ఆరోపించారు. వైసీపీ మంత్రులు త్వ‌ర‌లో విమాన యాత్ర‌లు కూడా చేస్తార‌ంటూ సెటైర్లు వేశారు. 

దొరికితే ప్ర‌జ‌లు వెంట‌బ‌డి కొడ‌తారని వైసీపీ నేత‌ల‌కు భ‌యం ప‌ట్టుకుంద‌ని ఎద్దేవా చేశారు. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంద‌ని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. పొత్తులు ఎన్నికల స‌మ‌యంలో తీసుకునే నిర్ణ‌య‌మ‌ని .. గ‌తంలో జ‌గ‌న్ తండ్రి వైఎస్ఆర్ ఇత‌ర పార్టీల‌తో పొత్తులు పెట్టుకోలేదా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. చంద్ర‌బాబు యాత్ర‌కు (chandrababu naidu) వ‌స్తోన్న స్పంద‌న చూసి జ‌గ‌న్‌కు ఓట‌మి భ‌యం ప‌ట్టుకుంద‌ని దుయ్యబట్టారు. 

అంతకుముందు వైసీపీ రాజ్యసభ అభ్యర్ధుల ఎంపికపై అచ్చెన్నాయుడు మండిపడ్డారు. బీసీలు అంటే తెలుగుదేశం... తెలుగుదేశం (telugu desam party) అంటే బీసీలన్నారు. తలకిందులుగా తపస్సు చేసినా, ఎన్ని జన్మలెత్తినా సరే ఈ బంధాన్ని నీవు విడదీయలేవని ముఖ్యమంత్రి జగన్‌‌ను  (ys jagan) ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బీసీలను, టీడీపీని విడదీయడం ఎవరి తరం కాదని, జగన్ తరం కూడా కాదని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. 

బీసీలకు పదవులిచ్చామని సీఎం చెప్పుకుంటున్నారని... దేనికి ఈ పదవులని ఆయన ప్రశ్నించారు. పదవులిచ్చి, నోళ్లకు ప్లాస్టర్ వేయడానికా? అని ఆయన ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్రాన్ని నలుగురు రెడ్లకు రాసి పెట్టారని... ఉత్తరాంధ్రని ఒకరికి, కోస్తాంధ్రను ఒకరికి, కృష్ణా, గుంటూరు జిల్లాలను ఒకరికి, రాయలసీమను ఒకరికి రాసిచ్చారని అచ్చెన్నాయుడు విమర్శించారు. అయితే, రెడ్లంటే తనకు ఎలాంటి కోపం లేదని చెప్పారు. 

బీసీ సామాజిక వర్గానికి చెందిన తాను టీడీపీ హయాంలో మంత్రిగా పని చేశానని... తాను, కేఈ కృష్ణమూర్తి, యనమల, కళా వెంకట్రావు, కొల్లు రవీంద్ర, పితాని సత్యనారాయణ వంటి బీసీ మంత్రులందరూ స్వతంత్రంగా పని చేశామని అచ్చెన్నాయుడు చెప్పారు. జగన్ పాలనలో బీసీ మంత్రులు కనీసం మాట్లాడే పరిస్థితిలోనైనా ఉన్నారా? అని ఆయన ప్రశ్నించారు.

ఇకపోతే.. వైసీపీ ప్రభుత్వంపై తన అసమ్మతి తెలిపిన ఎస్సీ మహిళ వెంకాయమ్మకు (venkayamma) వైసీపీ నాయకులు, కార్యకర్తల నుంచి రక్షణ కల్పించాలని గుంటూరు ఎస్పీకి టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు లేఖ రాసారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజాస్వామ్యబద్ధంగా తమ అసమ్మతి తెలుపుతున్న వారిపై దాడికి పాల్పడుతున్నారని... రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రసాదించిన ప్రాథమిక హక్కులకు తీవ్ర విఘాతం కలిగిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వంపై తన అసమ్మతి తెలిపిన ఎస్సీ-మాల సామాజిక వర్గానికి చెందిన వెంకాయమ్మపై జరిగిన దాడే ఇందుకు నిదర్శనమని అచ్చెన్న పేర్కొన్నారు. 

click me!