ఉద్యోగుల జీతాలను తగ్గించి... సీఎం జగన్ చరిత్రలో నిలిచిపోయారు..: అచ్చెన్న సెటైర్లు

Arun Kumar P   | Asianet News
Published : Jan 20, 2022, 04:59 PM ISTUpdated : Jan 20, 2022, 05:01 PM IST
ఉద్యోగుల జీతాలను తగ్గించి... సీఎం జగన్ చరిత్రలో నిలిచిపోయారు..: అచ్చెన్న సెటైర్లు

సారాంశం

ఉద్యోగులు జీతాలను పెంచకపోగా చివరకు తగ్గేలా రివర్స్ నిర్ణయాలు తీసుకున్న ఏకైక సీఎంగా జగన్ రెడ్డి నిలిచారంటూ ఏపీ టిడిపి చీఫ్ అచ్చెన్నాయుడు ఎద్దేవా చేసారు.  

అమరావతి: ఉద్యోగులను ఉద్దరిస్తానని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఇప్పుడు హక్కులకోసం పోరాడుతున్న వారిపై లాఠీలు ఝుళిపించడం దుర్మార్గమని టిడిపి (TDP) ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు (atchannaidu) మండిపడ్డారు. హక్కుల కోసం ఉద్యమిస్తే అరెస్టులా? అని ప్రభుత్వాన్ని నిలదీసారు. ఉద్ధరిస్తానని గద్దెనెక్కి హామీలను అమలు చేయకపోగా ఇప్పుడు ఉద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడతావా జగన్ రెడ్డి? అని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసారు. 

''పిల్లలకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు రోడ్డెక్కి నిరసనలు, ఉద్యమాలు చేసే పరిస్థితిని రాష్ట్రంలో తీసుకొచ్చారు. గతంలో 43% పిఆర్సి (PRC) ఇస్తే తప్పుబట్టిన జగన్ రెడ్డి నేడు అసలు వేతనాలకు ఎసరు పెట్టాడు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రివర్స్ పాలన తప్ప పురోభివృద్ధి లేని రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ చరిత్రను జగన్ రెడ్డి (ys jagan) దిగజార్చారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జీతాలు తగ్గేలా, ఉద్యోగుల నుండి బకాయిలు వసూలు చేసేలా జీవోలు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం, ఏకైక ముఖ్యమంత్రి జగన్ రెడ్డి'' అని ఎద్దేవా చేసారు. 

''బడిలో పిల్లలకు పాఠాలు చెబుతూ ఉపాధ్యాయులు, ప్రజలకు అవసరమైన సేవలు చేస్తూ ఉద్యోగులు బిజీగా ఉండేవారు. అలాంటిది ఇప్పుడు మా పొట్ట కొట్టొద్దు అంటూ రోడ్డెక్కే పరిస్థితిని జగన్ రెడ్డి తీసుకువచ్చారు. ఉద్యోగుల న్యాయమైన కోర్కెలను పరిష్కరించాల్సింది పోయి అరెస్టులు చేయడం, నోటీసులు ఇవ్వడం సిగ్గుచేటు'' అని అచ్చెన్న మండిపడ్డారు.

''కోవిడ్ సమయంలో రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, హెల్త్ తో పాటు పలు శాఖల ఉద్యోగులు ప్రాణాలకు తెగించి సేవలందించారు. వారి ఆకాంక్షలకు విరుద్ధంగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరిగిందని కాగ్ నివేదిక చెబుతుంటే నిధులు లేవని వేతనాల్లో కోతలు విధించి ఉద్యోగుల పొట్టకొట్టడం దుర్మార్గం'' అన్నారు. 

''నాలుగు గోడల మధ్య ఉండి విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులను ప్రభుత్వం రోడ్డుపైకి తెచ్చింది. ఆదాయం కోసం ఉపాధ్యాయులతో మద్యం అమ్మించారు. ప్రశ్నిస్తే వేధింపులకు గురిచేశారు. నాడు నేడు పేరుతో కోవిడ్ సమయంలో పాఠశాలలు నిర్వహించి వందలాది మంది ఉపాధ్యాయుల మరణాలకు కారకులయ్యారు'' అని అచ్చెన్న ఆరోపించారు. 

''కల్లబొల్లి కబుర్లు, మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం గత రెండున్నరేళ్లలో ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ఉద్యోగులకు మొండిచేయి చూపింది. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరణ చేస్తానని జగన్ అనేక సార్లు ప్రకటించారు. అది నేటికీ కార్యరూపం దాల్చలేదు. వారి ఆశలకు జగన్ సమాధి కట్టారు'' అని విరుచుకుపడ్డారు. 

''హక్కుల కోసం, న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉద్యోగుల న్యాయ పోరాటానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుంది. హక్కులు సాధించుకునే వరకు అండగా నిలుస్తుంది. ఉద్యోగులందరూ ఏకతాటిపైకి రావాలి. భవిష్యత్ లో జరిగే పరిణామాలకు ప్రభుత్వమే భాద్యత వహించాలి'' అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పీఆర్సీ విషయమై జారీ చేసిన జీవోలను నిరసిస్తూ ఉద్యోగ సంఘాలు ఆందోళన బాట పట్టాయి. ఏపీ NGOతో పాటు ఏపీ జేఏసీ, ఏపీ అమరావతి జేఏసీ, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం సహా  పలు ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు కూడా ఆందోళనకు సిద్దమంటూ ప్రకటించాయి.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Chandrababu Power Full Speech: అనకాపల్లిలో స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం| Asianet News Telugu
Kandula Durgesh Super Speech: Amarajeevi Jaladhara Scheme Foundation Ceremony | Asianet News Telugu