మద్యాన్ని ఏరులై పారించడమేనా మద్యపాన నిషేదమంటే?: జగన్ పై అచ్చెన్న సెటైర్లు

By Arun Kumar PFirst Published Aug 2, 2021, 2:47 PM IST
Highlights

మధ్యపాన నిషేదమంటూ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాన మద్యాన్ని ఏరులై పారిస్తున్నారంటూ వైసిపి సర్కార్, సీఎం జగన్ పై మండిపడ్డారు అచ్చెన్నాయుడు. 

అమరావతి: గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన మద్యపాన నిషేదం హామీ ఏమైందో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సమాధానం చెప్పాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు నిలదీశారు. మద్యపాన నిషేదం చేస్తామని చెప్పి మద్యం షాపులు పెంచుకుంటూ పోతున్నారు... రాష్ట్రంలో మద్యం ఏరులై పారించటమే మద్యపాన నిషేదమా? అంటూ మండిపడ్డారు. 

''గ్రామాల్లో మద్యం షాపు లేని బజారు ఉందా? మద్యపాన నిషేదం అని మద్యానికి రహదారులు వేసి మరీ మద్యం అమ్ముతూ రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్ గా మార్చారు. ఉన్న మద్యం షాపులు చాలవన్నట్లుగా వాక్ ఇన్ స్టోర్ పేరుతో పట్టణాల్లలోని సెంటర్లలో 90 మద్యం మాల్స్ కు ప్రభుత్వం అనుమతులిచ్చింది, వీటిలో ఇప్పటికే 21 మాల్స్ ప్రారంభయ్యాయి. వాటితో పాటు పర్యాటక ప్రాంతాల్లో మద్యం షాపులు అంటూ మొత్తం 300 షాపులు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు వేసిన ప్రభుత్వం 41 షాపులను ప్రారంభించింది. మద్యపాన నిషేదం అని చెప్పి మద్యం షాపులు పెంచటం ప్రజలను వంచించటమే'' అన్నారు. 

''జగన్ రెడ్డి తన కమిషన్ల కోసం నాసిరకం బ్రాండ్లు అమ్ముతూ ప్రజల  ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఓ వైపు మద్యం రేట్లు పెంచి ప్రభుత్వ పెద్దల డిస్టరీలకు లాభం చేకూర్చుతూ... మరో వైపు ఏడాదికి రూ.5 వేల కోట్ల జె ట్యాక్స్ దండుకుంటూ 5 ఏళ్లలో రూ. 25 వేల కోట్ల దోపిడికి ప్రణాళిక రూపొందించారు'' అని ఆరోపించారు. 

read more  మహిళా కార్మికులను ఈడ్చుకెళ్లిన పోలీసులు... మంగళగిరిలో ఉద్రిక్తత: లోకేష్ సీరియస్ (వీడియో)

''జగన్ రెడ్డికి సంపద సృష్టించటం చేతకాక రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు. ఆ అప్పుల తీర్చేందుకు మద్యం షాపులు, మద్యం రేట్లు పెంచి మందుబాబుల రక్తం త్రాగుతున్నారు. మద్యంపై వచ్చే ఆదాయం చూపి ఏపీ అభివృద్ది కార్పోరేషన్ ద్వారా ఇప్పటికే రూ. 25 వేల కోట్లు అప్పులు తెచ్చారు. మరి మీరు చెప్పిన మద్య నిషేదం హామీ ఏమైంది?'' అని నిలదీశారు. 

''అప్పులు తెచ్చి అవి తీర్చలేక మద్యం అమ్మకాలు పెంచి మందుబాబుల రక్తంతో, వారి కుటుంబాల కన్నీళ్లతో ఆ అప్పులు తీర్చాలని చూస్తున్నారా? మద్యం ఆదాయం మత్తులో మునిగిన వైసీపీ ప్రభుత్వానికి మహిళలు మత్తు వదిలించటం ఖాయం'' అని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. 

click me!