కరోనాను ఎదుర్కోవడంలో ఏపీ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ చెప్పారు.
అమరావతి: కరోనాను ఎదుర్కోవడంలో ఏపీ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ చెప్పారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను పురస్కరించుకొని వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. రాష్ట్రంలో కొత్తగా కోవిడ్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ప్రైవేట్ ఆసుపత్రిలోనూ కోవిడ్ చికిత్స కోసం ఆరోగ్యశ్రీ కింద రోగులకు చికిత్స అందిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఏపీలోని 95 శాతం ప్రజలు ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తారని ఆయన గుర్తు చేశారు.
ఆక్సిజన్ కొరత లేకుండా ఇతర దేశాల నుండి క్రయోజనిక్ ఆక్సిజన్ ను తెప్పించామన్నారు. ప్రతి రోజూ 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను సరఫరా చేశామని ఆయన వివరించారు. ఏపీలో కొత్తగా కరోనా సెంటర్లను ఏర్పాటు చేశామని గవర్నర్ చెప్పారు. ప్రతి ప్రైవేట్ ఆసుపత్రిలోనూ కరోనా రోగులకు 50 శాతం బెడ్స్ రిజర్వ్ చేశామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1.80 కోట్ల మందికి పరీక్షలు నిర్వహిస్తే 14 లక్షల 54 వేల మందికి కరోనా వచ్చిందని గవర్నర్ చెప్పారు.
దేశ వ్యాప్తంగా ఫిబ్రవరి నుండి దేశంలో సకండ్ వేవ్ ఉధృతంా ఉందన్నారు. దేశంలో రోజూ కనీసం 4 లక్షలకు పైగా కేసులు నమోదౌతున్నాయని ఆయన చెప్పారు. సెకండ్ వేవ్ లో మరణాల సంఖ్య కూడ ఎక్కువగానే ఉందన్నారు. కోవిడ్ కారణంగా మరణించిన కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కోవిడ్ పై పోరాడుతున్న ఫ్రంట్‌లైన్ వర్కర్లకు సెల్యూట్ చేస్తున్నానని ఆయన చెప్పారు. కరోనాకారణంగా ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం చూపినా కూడ సంక్షేమ పథకాలను కొనసాగించామని గవర్నర్ తెలిపారు. ప్రజల సంక్షేమం ప్రాధాన్యతగా 95 శాతం హామీలను పూర్తి చేశామని ఆయన గుర్తు చేశారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటింటికి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని ఆయన వివరించారు.
విద్యాశాఖకు అన్ని పథకాల కింద రూ. 25,714 కోట్లు కేటాయించామన్నారు. జగనన్న విద్యాకానుక కింద 47 లక్షల మందికి లబ్ది చేకూరుతుందని గవర్నర్ తెలిపారు. 44.5 లక్షల మంది తల్లులకు జగనన్న అమ్మఒడి వర్తించనుందన్నారు. ఈ పథకం కింద రూ. 13,022 కోట్లు ఖర్చు చేస్తున్నామని ఆయన చెప్పారు. జగనన్న గోరుముద్ద కింద 36.88 లక్షల మందికి రూ. 1600 కోట్లు కేటాయించినట్టుగా చెప్పారు.ఇరిగేషన్ కింద ఇప్పటికే 14 ప్రాజెక్టులు పూర్తి చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ పథకం కింద రైతులకు పెట్టుబడి సహాయం అందిస్తున్నామని చెప్పారు. 2019-20 ఏడాదికి 52.38 లక్షల మంది రైతులకు 17030 కోట్లు కేటాయించారు. రైతులకు 9 గంటల పాటు నిరంతర ఉచిత విద్యుత్ ను అందిస్తున్నామని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. గ్రామసచివాలయాల ద్వారా అవినీతి రహిత పాలనను అందిస్తున్నట్టుగా గవర్నర్ చెప్పారు. రాష్ట్రంలో 56 బీసీ కార్పోరేషన్లను ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలను వేగంగా అందించే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఆయన తెలిపారు.