చేతులు ముడుచుకుని కూర్చోలేం: రఘురామ పిటిషన్ మీద జగన్ ప్రభుత్వం కౌంటర్

By telugu teamFirst Published May 20, 2021, 7:34 AM IST
Highlights

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణమ రాజు దాఖలు చేసిన ఎస్ఎల్పీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. రఘురామ కృష్ణమ రాజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేశారని ఆరోపించింది.

న్యూఢిల్లీ: నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణమ రాజుపై ఎవరో ఫిర్యాదు చేసే వరకు చేతులు ముడుచుకుని కూర్చుని వేచి చూడాలనే హక్కు పిటిషనర్ కు లేదని వైఎస్ జగన్ ప్రభుత్వం అభిప్రాయపడింది. ఈ మేరకు రఘురామ కృష్ణమ రాజు వేసిన ఎస్ఎల్పీ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. రఘురామపై తప్పుడు కేసులు బనాయించారనే ఆయన తరఫు న్యాయవాదుల వాదనలను ప్రభుత్వం ఖండించింది. 

ఎవరూ పిర్యాదు చేయకపోయినా సిఐడి అధికారులే సొంతంగా దర్యాప్తు చేపట్టినట్లు చెప్పి ఎఫ్ఐఆర్ నమోదు చేశారనే వాదలను కూడా ప్రభుత్వం తోసి పుచ్చింది. రఘురామ కృష్ణమ రాజు ప్రకటనలు రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఉన్నట్లు నిర్ధారించుకున్న తర్వాతనే ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపింది. ఎదుటివర్గంపై దాడి చేయడమే కాకుండా చంపేంత వరకు వెళ్లేలా వ్యక్తులను రెచ్చగొట్టేందుకు రఘురామ కృష్ణమ రాజు ప్రయత్నించారని ప్రభుత్వం ఆరోపించింది.

రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా ప్రభుత్వం పట్ల అసంతృప్తిని పెంచడానికి రఘురామ ఉద్దేశ్యపూర్వకంగా ప్రయత్నించారని, ఆయన ప్రకటనలను పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాతనే రాజద్రోహం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశామని తెలిపింది. 

పార్లమెంటు సభ్యుడితో పాటు ప్రతి వ్యక్తికీ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఉంటుందని, అయితే, ఆ హక్కును శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధగా ప్రయోగించడానికి వీలు లేదని ప్రభుత్వం వివరించింది. రఘురామ పొరపాటునో గ్రహపాటునో ఒకటి, రెండు సార్లు మాత్రమే ప్రకటనలు చేయలేదని, పలువురు వ్యక్తులతో కలిసి ఉద్దేశ్యపూర్వకంాగ కుట్రపూరితంగా రాష్ట్రంలో కులాల మధ్య, మతాల మద్య చిచ్చు పెట్టి అశాంతి సృష్టించడానికి ప్రయత్నించారని ఆరోపించింది.

ప్రభుత్వం పట్ల అసంతృప్తిని పెంచడానికే వివిధ తరగతులు, సామాజిక వర్గాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని ప్రభుత్వం విమర్శించింది. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు కూడా వెనక్కి తగ్గలేదని, తన పాదాలపై పోలీసులు కొట్టినట్లు చూపించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టే సంకేతాలు ఇచ్చారని ఆరోపించింది. 

రఘురామ కృష్ణమ రాజును చిత్రహింసలకు గురిచేశారనే ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని, అదే నిజమైతే ప్రభుత్వం పిటిషనర్ ను వైద్య పరీక్షలకు అనుమతి ఇచ్చి ఉండేది కాదని అన్నది. తన అరెస్టుకు వ్యతిరేకంగా ఒక భ్రాంతిని కలిగించడానికి రఘురామ అలా చేశారని ప్రభుత్వం తన అఫిడవిట్ లో అన్నది.

click me!