ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో కీలక పరిణామం.. ఏసీబీ ఆదేశాల్ని కొట్టేసిన హైకోర్టు..

By Rajesh KarampooriFirst Published Mar 17, 2023, 6:41 AM IST
Highlights

మనీ లాండరింగ్ కేసులో  హైకోర్టులో దాఖలైన పిటిషన్‌లో విచారణ విభాగం సీఐడీకి అనుకూలంగా గురువారం తీర్పు వెలువడింది. జీవీఎస్‌ భాస్కర్‌ అరెస్ట్‌ విషయంలో విజయవాడ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాల్ని ఏపీ హైకోర్టు కొట్టేసింది.

ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారిన ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే ఒక వైపు ఏపీసిఐడి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంపై విచారిస్తుండగా.. మనీ ల్యాండరింగ్ పై సీఐడీ కూడా ప్రత్యేకంగా దృష్టి సారించింది.  అయితే.. ఈ కేసుపై హైకోర్టులో దాఖలైన పిటిషన్‌లో విచారణ విభాగం సీఐడీకి అనుకూలంగా గురువారం తీర్పు వెలువడింది.

జీవీఎస్‌ భాస్కర్‌ అరెస్ట్‌ విషయంలో విజయవాడ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాల్ని ఏపీ హైకోర్టు కొట్టేసింది.భాస్కర్‌ రిమాండ్‌ను ఏసీబీ కోర్టు సస్పెండ్‌ చేసింది. దీంతో ఆ ఆదేశాలను సవాల్‌ చేస్తూ సీఐడీ  హైకోర్టును ఆశ్రయించింది. విచారణ సమయంలో సీఐడీ తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. అయితే.. ఈ కేసులో సెక్షన్‌ 409 వర్తిస్తుందని స్పష్టం చేస్తూ.. విజయవాడ ఏసీబీ కోర్టు జారీ చేసిన ఆదేశాల్ని హైకోర్టు కొట్టేసింది .

ఇదిలా ఉంటే.. గత ప్రభుత్వంలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో వందల కోట్ల రూపాయల నిధులు దారి మళ్లాయన్న అభియోగాలపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో భాస్కర్‌ను నోయిడాలో అరెస్ట్ చేసి ట్రాన్సిట్ వారెంట్‌పై విజయవాడ కోర్టుకు తీసుకొచ్చారు. అయితే.. భాస్కర్‌ రిమాండ్‌ను తిరస్కరించింది విజయవాడ సీఐడీ కోర్టు. భాస్కర్‌ను సీఐడీ అధికారులు విచారించాలని అనుకుంటే 41-ఏ సీఆర్పీసీ ప్రకారం చేయవచ్చని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

దీంతో ఈ ఆదేశాలపై హైకోర్టును  సీఐడీ ఆశ్రయించింది. ఇప్పటికే ఈ కేసులో 330 కోట్లకు పైగా నిధులు దుర్వినియోగం చేసినట్టు అభియోగంపై ఈడీ  ఆధారాలను సేకరించింది. ఈ వ్యవహరంలో ఎవరి పాత్ర ఎంత..? ఈ స్కామ్ లో వెనుక ఇంకా ఎవరు ఉన్నారన్న దానిపై విచారణ సాగనున్నది. మనీ లాండరింగ్ కేసులో విచారణ సంస్థలు దూకుడుగా వ్యవహరించడంతో ఇప్పుడు అక్రమార్కుల్లో గుబులు పుడుతోంది.

click me!