ఓటర్ల ఆగ్రహం: ఏపీ ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంచలన ఆదేశాలు

By telugu teamFirst Published Mar 10, 2021, 2:15 PM IST
Highlights

పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ ఫోన్లను తీసుకుని వెళ్లే విషయంలో ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంచలన ఆదేశాలు జారీ చేశారు. ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తుండడంతో ఆయన ఆ ఆదేశాలు జారీ చేశారు.

అమరావతి: పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ ఫోన్లను అనుమతించే విషయంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఏపీఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంచలన ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ బూత్ ల్లోకి మొబైల్ ఫోన్లు తీసుకుని వెళ్లవచ్చునని ఆయన ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు తీసుకుని వెళ్తున్న ఓటర్లను పోలీసులు అడ్డుకుంటున్నారు.

దాంతో ఓటర్లు తీవ్రమైన అసహనానికి, ఆగ్రహానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో రమేష్ కుమార్ ఆ ఆదేశాలు జారీ చేసారు. ఓటు హక్కు వినియోగించుకోవాడనికి వస్తున్న ఓటర్ల వద్ద సెల్ ఫోన్లు ఉన్నా కూడా ఎటువంటి అభ్యంతరం చెప్పవద్దని ఆయన ఆదేశించారు. అయితే, పోలింగ్ కేంద్రాల్లో సెల్ ఫోన్లు వాడుకూడదని, అటువంటిది జరిగితే సీజ్ చేయాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లే సమయంలో సెల్ ఫోన్లు ఆఫ్ చేసుకోవాలని ఆయన సూచించారు. 

సెల్ ఫోన్లు తీసుకు రావద్దని ఎటువంటి ఆదేశాలు కూడా ఇవ్వలేదని ఓటర్లు మండిపడ్డారు. ముందుగా తమకు సమాచారం ఇవ్వలేదని వారన్నారు. సెల్ ఫోన్లు తీసుకు వస్తున్నవారిని పోలీసులు అడ్డుకోవడంతో వారు ఓటేయకుండానే తిరిగి వెళ్లిపోతున్నారు. దీంతో ఓటింగ్ శాతాన్ని పెంచడానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ సెల్ ఫోన్లను లోనికి అనుమతించాలని ఆదేశించారు. 

బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

click me!