25 వేల కోట్ల అప్పును దాచారు.. డేటా మీరు ఇవ్వకుంటే, ఎన్నో దారులు: బుగ్గనకు పయ్యావుల కౌంటర్

By Siva KodatiFirst Published Jul 13, 2021, 5:55 PM IST
Highlights

రూ.25,000 కోట్లను ఎందుకు దాచారని బుగ్గనను ప్రశ్నించారు ఏపీ పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్. ఇలా దాచిన వాటిని ప్రజల ముందు పెట్టాలని కేశవ్ డిమాండ్ చేశారు. బ్యాంక్ గ్యారెంటీలపై సమాచారం కోరితే.. స్పందించడానికి ఆర్ధిక శాఖ కార్యదర్శికి సంవత్సరం పట్టిందని పయ్యావుల పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జమా ఖర్చుల వ్యవహారం అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారి తీస్తోంది. ఇప్పటికే ఈ వ్యవహారానికి సంబంధించి మంగళవారం ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పీఏసీ ఛైర్మన్, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడారు. వివిధ కార్పోరేషన్‌లలో చేసిన అప్పుల వివరాలను ప్రజల ముందు వుంచాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

పారదర్శకతను నిరూపించుకోవాలనే తాము అడుగుతున్నామని కేశవ్ అన్నారు. తాము సామాన్యులనైనా గౌరవిస్తామని.. అలాంటిది ఆర్ధిక మంత్రి బుగ్గనను గౌరవించకుండా ఎలా వుంటామని కేశవ్ ప్రశ్నించారు. గవర్నర్‌కు లేఖపై బుగ్గన చాలా తేలికగా మాట్లాడారని పయ్యావుల విమర్శించారు. రూ.25,000 కోట్లను ఎందుకు దాచారని బుగ్గనను ప్రశ్నించారు. ఇలా దాచిన వాటిని ప్రజల ముందు పెట్టాలని కేశవ్ డిమాండ్ చేశారు. బ్యాంక్ గ్యారెంటీలపై సమాచారం కోరితే.. స్పందించడానికి ఆర్ధిక శాఖ కార్యదర్శికి సంవత్సరం పట్టిందని పయ్యావుల పేర్కొన్నారు.

Also Read:సీఎఫ్‌ఎం తెచ్చిందే టీడీపీ: పయ్యావుల విమర్శలకు బుగ్గన కౌంటర్

ప్రభుత్వంపై గౌరవం వుంది కాబట్టే తాము సంవత్సర కాలం వేచి చూశామని పయ్యావుల తెలిపారు. కొత్త ప్రభుత్వం, కోవిడ్ పరిస్ధితుల దృష్ట్యా తాము ఓపికగా ఎదురుచూశామని.. అలాంటిది తమను తేలిగ్గా మాట్లాడతారా అంటూ బుగ్గనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంక్ గ్యారెంటీల గురించి ప్రభుత్వం దాచిపెట్టిందని పయ్యావుల మండిపడ్డారు. ఢిల్లీలోని పీఏసీ కమిటీ, ఆర్‌బీఐల ద్వారా తాము సమాచారం సేకరిస్తామని కేశవ్ తెలిపారు. రూ.25 వేల కోట్లు అనేది పరిమితికి మించి చేసిన అప్పు అని ఆయన అన్నారు. 

click me!