AP New Districts: హిందూపురంలో యువకుడి ఆత్మహత్య యత్నం.. కొనసాగుతున్న బంద్..

Published : Jan 29, 2022, 11:13 AM ISTUpdated : Jan 29, 2022, 11:38 AM IST
AP New Districts: హిందూపురంలో యువకుడి ఆత్మహత్య యత్నం..  కొనసాగుతున్న బంద్..

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్విభజనకు (AP New Districts) సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడంతో పలుచోట్ల నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలపై పలుచోట్ల విపక్ష నేతల ఆధ్యర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్విభజనకు (AP New Districts) సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడంతో పలుచోట్ల నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలపై పలుచోట్ల విపక్ష నేతల ఆధ్యర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రాలను మార్చాలని కొన్నిచోట్ల.. కొత్త ఆకాంక్షలు మరికొన్ని చోట్ల నిరసలు నిర్వహిస్తున్నారు. కొన్ని జిల్లాల పేర్లపైన కూడా కొన్ని వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కొన్నిచోట్ల అధికార పార్టీకి చెందిన నేతల నుంచి నిరసన స్వరం వినిపిస్తోంది. 

ఈ క్రమంలోనే హిందూపురంను జిల్లా కేంద్రంగా చేయాలని ఆందోళనలు కొనసాగుతున్నాయి. శనివారం (జనవరి 29) హిందూపురం బంద్‌కు అఖిలపక్షం నేతలు పిలుపునిచ్చారు. దీంతో నేడు అక్కడ బంద్ కొనసాగుతుంది. హిందూపురం బస్టాండ్‌లో అఖిలపక్షం నాయకులు  బస్సులను అడ్డుకున్నారు. దీంతో బస్సులు దాదాపుగా డిపోకే పరిమితమయ్యాయి. బంద్‌కు సంఘీభావంగా వాణిజ్య స‌ముదాయాలు స్వ‌చ్ఛందంగా మూసివేశారు. హిందూపురంను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 

అయితే ఈ ఆందోళనలో భాగంగా.. అంబేడ్కర్ సర్కిల్‌లొ ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. పెట్రోల్ పోసుకుని నిప్పుపెట్టుకునేందుకు యత్నించాడు. అయితే అఖిలపక్షం నేతలు వెంటనే స్పందించి.. యువకుడిని అడ్డుకుని, పెట్రోల్ బాటిల్‌ను తీసుకున్నారు. అతనిపై నీళ్లు పోశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీసులు అక్కడికి చేరుకుని శాంతియుతంగా ఆందోళన నిర్వహించుకోవాలని అఖిలపక్ష నేతలకు సూచించారు.  

అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ.. కొత్త జిల్లాలో ఏర్పాటులో హిందూపురంకు అన్యాయం జరిగిందన్నారు. పార్లమెంట్ నియోజకవర్గాలను జిల్లాలుగా చేస్తానని పాదయాత్రలో చెప్పిన సీఎం జగన్.. హిందూపురంకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. అనంతపురం జిల్లాలో అతిపెద్ద పట్ణణం హిందూపురం అని అన్నారు. హిందూపురంపై ప్రభుత్వం ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. హిందూపురంను జిల్లా చేస్తామని వైసీపీ నేతలు చెప్పుకొచ్చారని అని అన్నారు. హిందూపురం వైసీపీ నేతలు కూడా హిందూపురం జిల్లా కేంద్రంగా ప్రకటించేందుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. 

ఇక, కొత్త జిల్లాల ఏర్పాటుకు సిద్దమైన ప్రభుత్వం.. అనంతపురం (Anantapur) జిల్లా రెండు జిల్లాలుగా విభజించనున్నట్టుగా నోటిఫికేషన్‌లో పేర్కొంది. అనంతపురం కేంద్రంగా అనంతపురం జిల్లా, పుట్టపర్తి కేంద్రంగా శ్రీసత్యసాయి జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. ఈ నిర్ణయంపై పుట్టపర్తి వాసులు హర్షం వ్యక్తం చేయగా.. హిందూపురం (hindupuram) ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ పట్టణంలో శుక్రవాం అఖిలపక్షం నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు.

ఇదివరకే కొత్త జిల్లాల ఏర్పాటుపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించిన సంగతి తెలిసిందే. పాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు బాలకృష్ణ తెలిపారు. అయితే సత్యసాయి జిల్లాను హిందూపురం కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరారు. ఈ మేరకు బాలకృష్ణ ఓ వీడియో విడుదల చేశారు. జిల్లా కేంద్రానికి ఉండాల్సిన అన్ని అర్హతలు హిందూపురానికి ఉన్నాయన్నారు. ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన భూములు పుష్కలంగా ఉన్నాయని గుర్తు చేశారు. హిందూపురం పట్టణ ప్రజల మనోభావాలను గౌరవించి జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విన్నవించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

CM Chandrababu Naidu: నారావారిపల్లెలో అభివృద్ధిపనులు ప్రారంభించిన సీఎం| Asianet News Telugu
Bhumana Karunakar Reddy: కోనసీమ జిల్లాలో బ్లోఔట్ పై భూమన సంచలన కామెంట్స్ | Asianet News Telugu