ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడండి: చంద్రబాబు, దేవినేని ఉమలకు మంత్రి కొడాలి నాని వార్నింగ్

Published : Aug 03, 2019, 06:10 PM ISTUpdated : Aug 03, 2019, 06:18 PM IST
ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడండి: చంద్రబాబు, దేవినేని ఉమలకు మంత్రి కొడాలి నాని వార్నింగ్

సారాంశం

సిగ్గు లేకుండా రెండు కంపెనీలను కూర్చోపెట్టి రాజీ చేశారని విమర్శించారు. వాస్తవంగా చెప్పాలంటే చంద్రబాబు ఒక బ్రోకర్ లా వ్యవహరించారని కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీమంత్రి దేవినేని ఉమాలాంటి సన్నాసులను పెట్టుకుని పోలవరం ప్రాజెక్టును అన్ని విధాలా దోచుకున్నారని కొడాలి నాని ఆరోపించారు. 

అమరావతి : మాజీముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర మంత్రి కొడాలి నాని. పోలవరం ప్రాజెక్టు రీ టెండరింగ్ ల విషయంలో చంద్రబాుబ నాయుడు అనవసర రాద్దాంతం చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. 

అమరావతిలో ఓ మీడియా చానెల్ తో మాట్లాడిన మంత్రి కొడాలి నాని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనదైన శైలిలో తిట్టిపోశారు.

 గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు చేసిన యదవ పనులకు అడ్డుకట్ట వేయాలని చంద్రబాబు నాయుడుని సీఎం కుర్చీ నుంచి పీకేయాలని ప్రజలు భావించారు కాబట్టే జగన్ ను భారీ మెజారిటీతో గెలిపించారని చెప్పుకొచ్చారు. 

చంద్రబాబు నాయుడులా తాము కులపిచ్చి రాజకీయాలు చేయడం లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు చేసిన దౌర్భాగ్యపు పాలనను ఎప్పుడు తిప్పికొడదామా అని ప్రజలు ఎదురుచూశారని ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పారని తెలిపారు.  

చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పాలన కంటే ఫోటోలకు, మీడియాలకే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని విమర్శించారు. చంద్రబాబు అవినీతి, అక్రమాలను జగన్ అడ్డుకుంటారని ప్రజలు బ్రహ్మరథం పట్టారని చెప్పుకొచ్చారు.  

పోలవరం టెండర్ల పనులు ఆనాడు ట్రాన్స్ ట్రాయ్ కి ఇస్తే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పనులను నవయుగకు ఇచ్చారని ఆరోపించారు. సిగ్గు లేకుండా రెండు కంపెనీలను కూర్చోపెట్టి రాజీ చేశారని విమర్శించారు. వాస్తవంగా చెప్పాలంటే చంద్రబాబు ఒక బ్రోకర్ లా వ్యవహరించారని కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మాజీమంత్రి దేవినేని ఉమాలాంటి సన్నాసులను పెట్టుకుని పోలవరం ప్రాజెక్టును అన్ని విధాలా దోచుకున్నారని కొడాలి నాని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి అయిన ప్రాజెక్టును కేవలం డబ్బులు దండుకునే ప్రాజెక్టుగా మార్చేశారంటూ కొడాలి నాని నిప్పులు చెరిగారు. 

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ప్రభుత్వం ఒక కమిటీని నియమించిందని ఆ కమిటీ ప్రాజెక్టులో అవినీతి చోటు చేసుకుందని తేల్చడం వల్లే రివర్స్ టెండరింగ్ కు వెళ్తున్నట్లు తెలిపారు. కాఫర్ డ్యాం కట్టేస్తే పోలవరం అయిపోయినట్లా అంటూ చంద్రబాబు నాయుడును నిలదీశారు. 

రూ. 33వేల కోట్లు రూపాయలు ఖర్చుపెట్టినట్లు లెక్కల్లో చూపించారని కానీ వాస్తవానికి అక్కడ రూ.1000 కోట్లు పనులు కూడా కాలేదని ఆరోపించారు. మీరా సీఎం వైయస్ జగన్ గురించి మాట్లాడేది అంటూ రెచ్చిపోయారు. 

పోలవరం ప్రాజెక్టు పనుల విషయంలో, మచిలీపట్నం పోర్టు నిర్మాణంలో పారదర్శకంగా పనులు చేపడతామని తెలిపారు. దేవినేని ఉమా, చంద్రబాబు బతుకేంటని నిలదీశారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు కొడాలి నాని. 

37 సంవత్సరాల వయసులో కాంగ్రెస్ పార్టీని వదిలి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టుకుని ఐదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉంటూ 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన నాయకుడు వైయస్ జగన్ అని చెప్పుకొచ్చారు. నువ్వు నీ నాయకుడు ఏం చేశారు అంటూ మండిపడ్డారు. 

సిగ్గు శరం లేకుండా పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి ఆయన కుర్చీని లాక్కుని, పదవులను లాక్కున్నారంటూ ధ్వజమెత్తారు. సొంత వదిన చావుకు కారణమైన దేవినేని ఉమ సీఎం జగన్ ను విమర్శిస్తే సహించేది లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు లో జరిగిన అవినీతిని వెలికితీసి బాబు దోపిడీని బయటపెడతామన్నారు. 

PREV
click me!

Recommended Stories

టీడీపీ బతుకంతా కాపీ పేస్టే.. Gudivada Amarnath Comments on Bhogapuram Airport | Asianet News Telugu
Cordon and Search Operation in Nellore: రౌడీలకు మందు బాబులకు చుక్కలే | Police | Asianet News Telugu