రైతాంగానికి మీరు చేసిన మోసాలు, అక్రమాలు బయటపెడతా : లోకేష్ కి మంత్రి కన్నబాబు కౌంటర్

By Nagaraju penumalaFirst Published Jul 1, 2019, 9:04 PM IST
Highlights

రైతులకు చేయాల్సిన నష్టం చేసి ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర కోసం చంద్రబాబు ఊబలాటపడతారా అంటూ నిప్పులు చెరిగారు. చంద్రబాబు ప్రభుత్వం అవకతవకలు, అక్రమాలు ఆధారాలతో సహా ఎండగడతామని హెచ్చరించారు మంత్రి  కురసాల కన్నబాబు. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విత్తనాల సంక్షోభానికి మాజీ సీఎం చంద్రబాబు నాయుడే కారణమని ఆరోపించారు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు. గత చంద్రబాబు సర్కార్ నిర్వాకం నేడు రైతులను నిండా ముంచేసిందని ఆరోపించారు. 

తెలుగుదేశం ప్రభుత్వం ఏపీ సీడ్స్‌ సంస్థకు రూ. 380 కోట్లు ఎగనామం పెట్టడం వల్లే పరిస్థితి ఇలా తయారైందన్నారు. నిధులు ఇవ్వకపోవడంతో ఏపీ సీడ్స్‌ సంస్థ రాష్ట్రంలో రైతులకు కావాల్సిన విత్తనాలు సేకరించలేకపోయిందన్నారు. దీంతో ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు విత్తనాలు లేకుండాపోయాయని తెలిపారు. 

రైతులకు విత్తనాలు అందించే విషయంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆనాటి చంద్రబాబు సర్కారు తీరుపై మంత్రి కురసాల కన్నబాబు తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబు వల్లే రైతులకు ఈ దుస్థితి పట్టిందన్నారు. 

విత్తనాల సేకరణ కోసం గత జనవరి నుంచి వ్యవసాయశాఖ అధికారులు నిధులు మంజూరు చేయాలని చంద్రబాబుకు లేఖలు రాసినా స్పందించలేదన్నారు. నిధులు విడుదల కోరుతూ 28 సార్లు అధికారులు చంద్రబాబుకు లేఖలు రాసినా వాటిని పట్టించుకున్న పాపాన పోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  

చంద్రబాబు, లోకేష్‌లకు ధైర్యముంటే ఈ విషయంలో సమాధానం చెప్పాలని నిలదీశారు. గతంలో నిధుల కోసం వ్యవసాయ శాఖ అధికారులు రాసిన లేఖలను టీడీపీ ఆఫీస్‌కి పంపిస్తాం సమాధానం చెప్తారా అంటూ మంత్రి కన్నబాబు కౌంటర్ ఇచ్చారు. 

చంద్రబాబు రైతులను ముంచేసిన నేపథ్యంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వారిని ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారని స్పష్టం చేశారు. విత్తనాల సరఫరా కోసం చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. 

ఇప్పటి వరకు రాష్ట్రంలో మూడు లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు రైతులకు సరఫరా చేసినట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి అధిక ధరకు విత్తనాలు కొనుగోలు చేసి రైతులకు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. 

మరోవైపు రైతులకు ఇవ్వాల్సిన ధాన్యం సేకరణ డబ్బులు కూడా గత చంద్రబాబు ప్రభుత్వం దారి మళ్లించిందని మంత్రి కురసాల కన్నబాబు ఆరోపించారు. రైతులను కష్టాల్లోకి నెట్టేసింది చంద్రబాబు సర్కార్ అంటూ ధ్వజమెత్తారు. 

రైతులకు చేయాల్సిన నష్టం చేసి ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర కోసం చంద్రబాబు ఊబలాటపడతారా అంటూ నిప్పులు చెరిగారు. చంద్రబాబు ప్రభుత్వం అవకతవకలు, అక్రమాలు ఆధారాలతో సహా ఎండగడతామని హెచ్చరించారు మంత్రి  కురసాల కన్నబాబు. 

click me!