
అమరావతి: మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ పై చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మంత్రి జయరాం ఆరోపించారు.
శుక్రవారం నాడు ఆయన కర్నూల్ లో మీడియాతో మాట్లాడారు. కార్మిక శాఖమంత్రిగా ఉన్న సమయంలో అచ్చెన్నాయుడు అవినీతికి పాల్పడ్డాడని ఆయన చెప్పారు.
గత ప్రభుత్వ హయంలో ఈఎస్ఐలో భారీ స్కామ్ జరిగిందని ఆయన తెలిపారు. మందులతో పాటు పరికరాల కొనుగోళ్లలో కూడ పెద్ద ఎత్తున అవినీతి జరిగిన విషయం జరిగిందని ఆయన చెప్పారు.
ఈఎస్ఐలో అవినీతి చోటు చేసుకొన్నందునే మాజీ మంత్రి అచ్చెన్నాయుడును అరెస్ట్ చేశారన్నారు. బీసీ నేత కాబట్టి అచ్చెన్నాయుడును అరెస్ట్ చేశారని తప్పుడు ప్రచారం చేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందన్నారు.
also read:గేట్లు దూకి ఇంట్లోకి వచ్చారు, ఆరోగ్యం బాగాలేదు: అచ్చెన్నాయుడు భార్య మాధవి
తప్పులు ఎవరూ చేసినా కూడ వారిని వదిలిపెట్టబోమని ఆయన తేల్చి చెప్పారు. అవినీతి కేసులో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడ అరెస్ట్ చేస్తామని ఆయన హెచ్చరించారు.
బీసీ కార్డు తీశారు: మంత్రి ధర్మాన కృష్ణదాస్
ఈఎస్ఐ స్కాంలో టీడీపీ ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయుడు అరెస్ట్ చేస్తే కిడ్నాప్ అంటూ చంద్రబాబు వక్రీకరిస్తున్నారని ఏపీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ చెప్పారు. శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.
నేరం జరిగినప్పుడు కూడ అరెస్ట్ చేయడం సర్వసాధారణమన్నారు. అచ్చెన్నాయుడు అరెస్ట్ పై చంద్రబాబు. లోకేష్ లు చేసిన వ్యాఖ్యలు సరైనవి కావన్నారు. తప్పు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేస్తే బీసీ కార్డును ముందుకు తెస్తున్నారని ఆయన మండిపడ్డారు. చట్టం తన పని తాను చేసుకొని పోతోందన్నారు.
బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు బీసీల సంక్షేమాన్ని వదిలేశారని ఆయన చెప్పారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తారని ఆయన గుర్తు చేశారు.