కాపులకు రిజర్వేషన్...జగన్, అమ్మో నా వల్ల కాదన్నాడు: గంటా

By sivanagaprasad kodatiFirst Published Jan 23, 2019, 11:07 AM IST
Highlights

కాపు రిజర్వేషన్లు ఎన్నో సంవత్సరాల కలన్నారు ఏపీ మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వస్తున్నా మీ కోసం పాదయాత్రలో కాపుల యొక్క వాస్తవిక స్థితిని గమనించిన చంద్రబాబు కాపుల సంక్షేమంపై దృష్టిపెట్టారన్నారు. 

కాపు రిజర్వేషన్లు ఎన్నో సంవత్సరాల కలన్నారు ఏపీ మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వస్తున్నా మీ కోసం పాదయాత్రలో కాపుల యొక్క వాస్తవిక స్థితిని గమనించిన చంద్రబాబు కాపుల సంక్షేమంపై దృష్టిపెట్టారన్నారు.

బీసీల్లో చేర్చే అంశంపై ఏదో ఒక జీవో ఇస్తే కోర్టులు కొట్టేసే అవకాశం ఉండటంతో ఆయన దానికి చట్టబద్ధత కల్పించేందుకు కృషి చేస్తున్నారన్నారు. కాపులకు రిజర్వేషన్, కాపు కార్పోరేషన్, 1000 కోట్ల నిధులు, కాపులకు ఉప ముఖ్యమంత్రి పదవి వంటి అంశాలను మేనిఫెస్టోలో వివరించినట్లుగానే నెరవేర్చారని గంటా శ్రీనివాసరావు తెలిపారు.

రూ.3,100 కోట్ల నిధులను కార్పోరేషన్‌కు కేటాయించారని గంటా వెల్లడించారు. మంజునాథ కమీషన్ ద్వారా కాపులను బీసీల్లో చేర్చే అంశంపై నివేదిక ఇచ్చిందన్నారు. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామన్నారు.

కానీ మోడీ ప్రభుత్వం దానిపై తేల్చకుండా నాన్చుతోందని ఆయన ఎద్దేవా చేశారు. ఇటీవల పార్లమెంట్‌లో ఆమోదం పొందిన ఈబీసీ బిల్లును అనుసరించి రాష్ట్రంలో 5 శాతం కాపులకు రిజర్వేషన్లు కల్పించి, మిగిలిన 5 శాతాన్ని కాపేతర అగ్రవర్ణాలకు ఇచ్చేందుకు కసరత్తు జరుగుతోందన్నారు.

కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై అసెంబ్లీలో చర్చ నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు. కాపు రిజర్వేషన్‌పై పాదయాత్రలో జగన్‌ను ప్రశ్నిస్తే తన వల్ల కాదని ఆయన చేతులెత్తేశారని మండిపడ్డారు.

కాపులకు రిజర్వేషన్లు కల్పించడం వల్ల మిగిలిన బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు నష్టం కలగదని ఆయన భరోసా ఇచ్చారు. విశాఖలో రీజనల్ కాపు భవన్ నిర్మించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇప్పటికే నిధుల కేటాయింపు, స్థల సేకరణ జరిగిందని గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. 
 

click me!