అన్ని ప్రాంతాలు అభివృద్ది చేయాలనే ఉద్దేశ్యంతోనే తాము మూడు రాజధానుల అంశాన్ని తెరమీదికి తెచ్చామని ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు.
విశాఖపట్టణం:ప్రజలను మోసం చేసి మరోసారి అధికారంలోకి రావాలని టీడీపీ ప్రయత్నం చేస్తుందని ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు.మంగళవారం నాడు ఆయన విశాఖపట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతి రాజధానికి తాము కట్టుబడి ఉన్నామని నిన్న టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేసిన ప్రకటనపై మంత్రి ధర్మానప్రసాదరావు స్పందించారు. ఈ ప్రాంతంలో ప్రజలు ఉపాధి లేక తీవ్రవాదుల్లో చేరిన పరిస్థితులున్నాయన్నారు.ఈ బతుకులు మారడానికి ఈ ప్రాంతం అభివృద్ది చెందాలనే స్థానిక ప్రజలు కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. చంద్రబాబుకు అనేక సార్లు అధికారం అప్పగించినా కూడా ఈ ప్రాంతంలో ఒక్క కేంద్ర సంస్థ కూడ తీసుకు రాలేదని ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చంద్రబాబునాయుడు దుబారా అంటున్నారని ఆయన మండిపడ్డారు.
also read:బుర్రుంటే విశాఖ అభివృద్దిని ఎందుకు వద్దంటున్నారు: అచ్చెన్నాయుడికి బొత్సకౌంటర్
undefined
2019 లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ మూడు రాజధానల అంశాన్ని తెరమీదికి తెచ్చింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ది చేయాలనే లక్ష్యంతో మూడు రాజధానులను తెచ్చామని వైసీపీ ప్రకటించింది. అమరావతిని శాసన రాజధానిగా,కర్నూల్ ను న్యాయ రాజధానిగా,విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తామని వైసీపీ వివరించింది. అయితే మూడు రాజధానులను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని కోరుతున్నాయి.
మూడు రాజధానుల డిమాండ్ తో జేఏసీ ఏర్పాటైంది. మూడు రాజధానుల డిమాండ్ తో వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పిస్తున్నారు. కరణం ధర్మశ్రీ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా సమర్పించారు. రాజీనామా పత్రాన్ని జేఏసీ నేతలకు అందించారు.
మరో వైపు అమరావతి నుండి అరసవెల్లికి రైతులు పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ పాదయాత్రను ఉత్తరాంధ్రపై దండయాత్రగా వైసీపీ ఆరోపిస్తుంది. ఈ పాదయాత్రకు వ్యతిరేకంగా మూడు రాజధానులకు అనుకూలంగా ప్రజల అభిప్రాయాలను ధీటుగా విన్పించాలని వైసీపీ నిర్ణయం తీసుకుంది.మూడు రాజధానులకు అనుకూలంగా మంత్రులు ప్రకటనలు చేస్తున్నారు. మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ విమర్శలు చేస్తున్న టీడీపీ, జనసేన నేతలపై మంత్రులు విరుచుకు పడుతున్నారు.
ఈ నెల 15న మూడు రాజధానలకు మద్దతుగా విశాఖలో గర్జన నిర్వహించనున్నారు. అదే సమయంలో ఈ నెల 15 నుండి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర నేతలతో సమావేశం కానున్నారు. విశాఖపట్టణం,విజయనగరం,శ్రీకాకుళం జిల్లాల నేతలతో పవన్ కళ్యాణ్ పర్యటిస్తారు. మూడు రాజధానులపై నమ్మకం ఉంటే అసెంబ్లీని రద్దు చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. అమరావతిలో రాజధాని ఉంటే నష్టం ఏమిటని ఆయన ప్రశ్నించారు.