నేనింతే: మళ్లీ నోరుజారిన మంత్రి ధర్మాన, నిరుద్యోగులపై సంచలన వ్యాఖ్యలు

By Nagaraju penumalaFirst Published Nov 23, 2019, 4:18 PM IST
Highlights

శ్రీకాకుళం జిల్లాకు చెందిన రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ నిరుద్యోగుల పట్ల కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే తెలుగుదేశం పార్టీపైనా, చంద్రబాబుపైనా తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఈసారి ఏకంగా కుక్కలు, పశువులు అంటూ రెచ్చిపోయారు. 
 

శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రులు నోరు జారుతున్నారు. మంత్రి అన్న విషయం మరచిపోతున్నారో లేక ప్రతిపక్షానికి ఘాటుగా సమాధానం ఇవ్వాలనుకుంటున్నారో తెలియదు గానీ తమ భాషలో బూతులు జోడించారు. నోటికి ఏదివస్తే అది మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తున్నారు.  

తాజాగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ నిరుద్యోగుల పట్ల కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే తెలుగుదేశం పార్టీపైనా, చంద్రబాబుపైనా తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఈసారి ఏకంగా కుక్కలు, పశువులు అంటూ రెచ్చిపోయారు. 

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో మెగా జాబ్ మేళాను ప్రారంభించారు మంత్రి ధర్మాన కృష్ణదాస్. జాబ్ మేళాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. తమ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను వివరిస్తున్నారు. అయితే ఎవరూ చప్పట్లు కొట్టకపోవడంతో అసహనానికి గురైన మంత్రి ధర్మాన టంగ్ స్లిప్ అయ్యారు. 

పిడికెడు గడ్డి వేస్తే పశువులు... బిస్కెట్ వేస్తే కుక్క కూడా విశ్వాసంగా ఉంటుందన్నారు. మనిషికి ఇంత సహాయం చేస్తే విశ్వాసంగా ఉంటారని చెప్పుకొచ్చారు. అయితే సీఎం జగన్ ఎన్నో మంచి పనులు చేస్తున్నా... చప్పట్లు కొట్టడం లేదంటూ వాపోయారు. 

మంచి ముఖ్యమంత్రిని ప్రోత్సహించాలని కోరారు. చప్పట్లు కొట్టడానికి చేతులు రాకపోవడం బాధాకరమన్నారు. నిరుద్యోగుల్లోనూ ప్రజల్లోనూ మార్పురావాలంటూ సూచించారు.  ఒక నిజాయితీ పరుడికి ఏం కావాలి? మీ హర్షధ్వనాలు, మీ చప్పట్లే కదా? అంటూ చెప్పుకొచ్చారు. 

వైసీపీ అధికారంలోకి రాగానే గ్రామ వలంటీర్లు, సచివాలయ ఉద్యోగాలు ఇచ్చామని గుర్తుచేశారు. ఇన్ని చేసిన ముఖ్యమంత్రి పట్ల కృతజ్ఞతగా ఉండాలా? వద్దా? అని నిరుద్యోగులను మంత్రి ప్రశ్నించారు. అయితే మంత్రి ధర్మాన కృష్ణదాస్ టంగ్ స్లిప్ అవ్వడంపై కొందరు అసహనం వ్యక్తం చేశారు.  

click me!