ఏపీ రాష్ట్ర ఆర్ధిక స్థితిపై పీఏసీ ఛైర్మెన్ పయ్యావుల కేశవ్ విమర్శలకు ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి కౌంటరిచ్చారు. ఆడిట్ సంస్థలు రాసిన లేఖల ఆధారంగా కేశవ్ విమర్శలు చేశారన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే సీఎఫ్‌ఎంను తెచ్చారని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గుర్తు చేశారు.
అమరావతి:రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై పీఏసీ ఛైర్మెన్ పయ్యావుల కేశవ్ అనవసర అనుమానాలు రేకేత్తిస్తున్నారని ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు.మంగళవారం నాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. బిల్లులు లేకుండా డబ్బులు చెల్లించారనేది అవాస్తవమన్నారు. రూ. 41 వేల కోట్లకు లెక్కలున్నాయని ఆయన స్పష్టం చేశారు. సీఎఫ్‌ఎంని ప్రవేశపెట్టిందే టీడీపీ సర్కార్ అని ఆయన గుర్తు చేశారు. సీఎఫ్‌ఎంను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టింది కూడ టీడీపీ సర్కారేనని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.
రూ. 41 వేల కోట్ల అవతవకలు జరిగితే వ్యవస్థలు చూడవా అని ఆయన ప్రశ్నించారు. ఏజీ కార్యాలయం నుండి వచ్చిన లేఖను చూపి ఆరోపణలు చేయడం సరైందా అని ఆయన పయ్యావులను ప్రశ్నించారు. రూ. 41 వేల కోట్ల బిల్లుల చెల్లింపుల్లో ఆడిట్ సంస్థ వివరణ కోరిందని మంత్రి వివరించారు. ఈ వ్యవహారానికి సీఎఫ్‌ఎంఎస్ వ్యవస్థే కారణమన్నారు.
పీఏసీ ఛైర్మెన్ పయ్యావుల కేశవ్ ఆరోపణలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. ఆడిట్ సంస్థ ప్రశ్నల ఆధారంగా విమర్శలు చేస్తున్నారని చెప్పారు.అనుమానాలుంటే పీఏసీ ఛైర్మెన్ ప్రభుత్వం నుండి వివరణ తీసుకోవాలని ఆయన కోరారు. సాధారణంగా ఇలాంటి ఆర్ధిక విషయాల్లో యనమల రామకృష్ణుడు స్పందిస్తారని ఆయన గుర్తు చేశారు. కానీ ఆడిట్ సంస్థల లేఖల ఆధారంగా విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.