
విజయవాడ: తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ పై ఏపీ మంత్రి ఆదినారాయణరెడ్డి ధ్వజమెత్తారు. ఓటమి భయంతోనే కేసీఆర్ చంద్రబాబుని టార్గెట్ చేశారని మండిపడ్డారు.కేసీఆర్‌కి నోటి దురద ఎక్కువైందని అందుకే అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తుల్ని కించపరచడం కేసీఆర్ నైజం అంటూ దుయ్యబుట్టారు.
చంద్రబాబు నాయుడుపై సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు మంత్రి ఆదినారాయణరెడ్డి తెలిపారు. చంద్రబాబుపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సబబు కాదన్నారు. జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఎక్కడికైనా వెళ్తారని స్పష్టం చేశారు.
మరోవైపు రాజకీయ కోణంలోనే ఏపీలో ఐటీ దాడులు జరుగుతున్నాయని ఆదినారాయణ రెడ్డి తెలిపారు. బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు పోరాడినా ఐటీ దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. ఐటీ దాడుల వల్ల ప్రజావ్యతిరేకత తప్ప ఇంకేమీ ప్రయోజనం ఉండదన్న విషయాన్ని బీజేపీ గ్రహించాలని హితవు పలికారు.