తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. అయితే తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది.
విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. చంద్రబాబు తరఫున సుప్రీం కోర్టు న్యాయవాది సిద్దార్థ లూథ్రా, సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. అయితే ఈ కేసును విచారిస్తున్న న్యాయమూర్తి తాను గతంలో పీపీగా పనిచేశానని.. ఏవైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలని కోరారు. అభ్యంతరాలు ఉంటే వేరే బెంచ్‌కు మారుస్తానని చంద్రబాబు లాయర్‌ను ప్రశ్నించారు. అయితే ఇందుకు చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్దార్థ లూథ్రా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు.
మరోవైపు చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై కౌంటర్ దాఖలుకు సీఐడీ సమయం కోరింది. ఇందుకు అంగీకరించిన హైకోర్టు.. విచారణను ఈ నెల 19కి వాయిదా వేశారు. కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా సీఐడీని హైకోర్టు ఆదేశించింది. ఇరుపక్షాల వాదనలు పూర్తిగా వినాల్సి ఉందని హైకోర్టు పేర్కొంది. అదే సమయంలో చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇవ్వొద్దని ఆయన న్యాయవాదులు కోరారు. దీంతో చంద్రబాబు సీఐడీ కస్టడీపై ఈ నెల 18 వరకు ఎలాంటి విచారణ చేపట్టవద్దని విజయవాడ ఏసీబీ కోర్టును ఆదేశించింది.
మరోవైపు అమరావతి రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను కూడా హైకోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది.
ఇక, స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్, ప్రత్యేక ఏసీబీ కోర్టు జారీచేసిన జ్యుడీషియల్ రిమాండ్ ఉత్తర్వులను కొట్టివేయాలని ఆదేశించాలని కోరుతూ చంద్రబాబు నాయుడు మంగళవారం ఏపీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు తరఫున ఆయన న్యాయవాది ఈ పిటిషన్ దాఖలు చేశారు. దురుద్దేశాలు, రాజకీయ కారణాలతో తనపై కేసు నమోదు చేశారని చంద్రబాబు ఈ పిటిషన్‌లో పేర్కొన్నారు. రిమాండ్ రిపోర్టులోని అవకతవకలు ఉన్నాయని, ఎలాంటి రుజువుల లేవని, ఆరోపణలన్నీ రాజకీయ ప్రేరేపితమని ఆయన అన్నారు. తనను బలిపశువుగా మారుస్తున్నారని పేర్కొన్నారు. ఈ కేసు ప్రొసీడింగ్‌లను కొనసాగించడానికి అనుమతిస్తే.. అది చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేసినట్లేనని ఆయన అన్నారు.