ఉపాధి హామీ పథకం నిధులను లబ్దిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేయాలని ఏపీ హైకోర్టు ఇవాళ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. చేసిన పనికి తమకు బిల్లులు చెల్లించడం లేదని 500 మంది ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ విషయమై ఇవాళ విచారణ నిర్వహించిన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
అమరావతి: ఉపాధిహామీ పథకం కింద చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంపై ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు సోమవారం నాడు ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు వారాల్లో కోర్టును ఆశ్రయించిన బాధితులందరికీ బిల్లులను చెల్లించాలని మధ్యంత ఉత్తర్వులను హైకోర్టు ఇవాళ జారీ చేసింది.
ఉపాధి హామీ పనులు చేసి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుండి నిధులు విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ 500 మంది ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారణ జరుపుతోంది. ఈ విషయమై ఇవాళ జరిగిన విచారణలో ప్రభుత్వం తీరును హైకోర్టు తప్పుబట్టింది.
చేసిన పనికి బిల్లులు విడుదల చేయకపోవడమంటే జీవించే హక్కును హరించడమేనని జస్టిస్ బట్టు దేవానంద్ వ్యాఖ్యానించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారంగా జీవించే హక్కు అంటే గౌరవంతో జీవించడమని ఆయన పేర్కొన్నారు.గతంలోనే ఈ బిల్లులను చెల్లించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.కానీ ప్రభుత్వం మాత్రం బాధితులకు బిల్లులు చెల్లించలేదు.
కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు రాలేదని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. రాష్ట్రానికి ఉపాధి హామీ పథకం కింద రూ.1919 కోట్లను జమ చేసినట్టుగా కేంద్ర ప్రభుత్వం ఏపీ హైకోర్టుకు అఫిడవిట్ ను సమర్పించింది. అయితే ఈ నిధులు తమకు రాలేదని ఏపీ ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానం దృఫ్టికి తీసుకెళ్లింది.
కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసినా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా తమకు నిధులు రాలేదని చెప్పడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.
కోర్టును ఆశ్రయించిన 500 మంది పిటిషనర్లకు రెండు వారాల్లో నిధులు ఇవ్వాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు గ్రామపంచాయితీల్లో కాకుండా నేరుగా లబ్దిదారుల్లో బ్యాంకు ఖాతాల్లోనే డబ్బులను డిపాజిట్ చేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.