చంద్రబాబు భద్రతపై అఫిడవిట్ దాఖలు చేయండి: జగన్ సర్కార్ కు హైకోర్టు ఆదేశం

By Nagaraju penumalaFirst Published Jul 2, 2019, 4:29 PM IST
Highlights

అలాగే గతంలో చంద్రబాబుపై అలిపిరిలో మావోయిస్టులు దాడి చేశారని ఈ నేపథ్యంలో భద్రతను కంటిన్యూ చేయాలని కోరారు. చంద్రబాబు నాయుడుతోపాటు ఆయన కుమారుడు నారా లోకేష్, మరియు ఇతర కుటుంబ సభ్యులకు భద్రత తగ్గించినట్లు హై కోర్టులో వాదించారు చంద్రబాబు తరపు న్యాయవాది.
 

అమరావతి:  
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు భద్రతకు సంబంధించి పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది ఏపీ హైకోర్టు. అనంతరం కోర్టు కేసు విచారణను ఈనెల 9కి వాయిదా వేసింది హైకోర్టు. భద్రత కుదింపుపై చంద్రబాబు నాయుడు సోమవారం సాయంత్రం హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. 

ఈ పిటీషన్ లో ప్రభుత్వం, ఏపీ డీజీపీ, గుంటూరు పోలీస్ ను ప్రతివాదులుగా చేర్చారు. చంద్రబాబు నాయుడు పిటీషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు మంగళవారం విచారణకు అనుమతించింది. రాజకీయ కారణాల వల్లే చంద్రబాబు నాయుడుకు భద్రత తగ్గించారంటూ చంద్రబాబు తరపు న్యాయవాది ఆరోపించారు.  

ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి చంద్రబాబు నాయుడకు ప్రాణ హాని ఉందని వాదించారు. గతంలో ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి 26 మందితో భారీ భద్రత కల్పించిన విషయాన్ని గుర్తి చేశారు. 

అలాగే గతంలో చంద్రబాబుపై అలిపిరిలో మావోయిస్టులు దాడి చేశారని ఈ నేపథ్యంలో భద్రతను కంటిన్యూ చేయాలని కోరారు. చంద్రబాబు నాయుడుతోపాటు ఆయన కుమారుడు నారా లోకేష్, మరియు ఇతర కుటుంబ సభ్యులకు భద్రత తగ్గించినట్లు హై కోర్టులో వాదించారు చంద్రబాబు తరపు న్యాయవాది.

నిబంధనలు అనుసరించే సెక్యూరిటీ కుదించామని అయినప్పటికీ పటిష్ట భద్రత కల్పిస్తున్నట్లు ప్రభుత్వం తరపున న్యాయవాది వాదించారు. చంద్రబాబు నాయుడుకు 74 మందితో భద్రత కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇరువాదనలు విన్న హై కోర్టు విచారణను ఈనెల 9కి వాయిదా వేసింది. 
 

click me!