రుషికొండ తవ్వకాలపై హైకోర్టులో విచారణ.. కేంద్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు..

By Sumanth KanukulaFirst Published Dec 22, 2022, 4:06 PM IST
Highlights

రుషికొండ తవ్వకాలకు సంబంధించి విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రుషికొండ తవ్వకాలపై కేంద్ర ప్రభుత్వ అధికారులతో కూడిన కమిటీని  నియమించాలని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖలను ఆదేశించింది. 

రుషికొండ తవ్వకాలకు సంబంధించి విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రుషికొండ తవ్వకాలపై కేంద్ర ప్రభుత్వ అధికారులతో కూడిన కమిటీని  నియమించాలని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖలను ఆదేశించింది. ఇప్పటికైనా ఏర్పాటైన కమిటీలో సభ్యులుగా ఉన్న ఏపీ ప్రభుత్వ అధికారులను తక్షణమే తొలగిచాలని స్పష్టం చేసింది. ఐదుగురు కేంద్ర ప్రభుత్వ అధికారులతోనే కమిటీని నియమించాలని స్పష్టం చేసింది. అధికారుల వివరాలను తమ ముందు ఉంచాలని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖలను ఆదేశించింది. రుషికొండపై జరుగుతున్న తవ్వకాలు, నిర్మాణాలను పరిశీలించి.. జనవరి 31వ తేదీలోపు నివేదికను సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. 

ఇక, విశాఖపట్నంలోని రుషికొండ తవ్వకాల అంశంపై టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణబాబు, జనసేన కార్పొరేటర్ మూర్తియాదవ్‌ దాఖలు చేసిన పిటిషన్‌లపై హైకోర్టు‌లో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. రుషికొండ తవ్వకాలపై వాస్తవాలు తేల్చేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖలను హైకోర్టు గతంలో ఆదేశించింది. అయితే హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్రం వేసిన కమిటీలో ముగ్గురు రాష్ట్ర ప్రభుత్వ అధికారులను నియమించించడం పిటిషనర్ల తరపు న్యాయవాదులు గత విచారణ సందర్భంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నియామకాలు కోర్టు ఆదేశాలకు విరుద్దంగా ఉన్నాయని అన్నారు.. ఈ క్రమంలోనే అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని గతంలోనే హైకోర్టు ఆదేశించింది. 

దీంతో ఏపీ ప్రభుత్వ అధికారులు నియామకాన్ని సమర్ధిస్తూ కేంద్రం ఆఫిడవిట్ దాఖలు చేసింది. ఈ క్రమంలోనే రాష్ట్రంతో కేంద్రం చేతులు కలిపినట్టుగా కనిపిస్తోందని హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్ల అభ్యంతరాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. ఈ క్రమంలోనే హైకోర్టు తాజా ఆదేశాలను జారీచేసింది. 

click me!