
అమరావతి: చింతామణి (chintamani) నాటకంపై నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఇవాళ(బుధవారం) ఏపీ హైకోర్టు (ap high court) విచారణ జరిపింది. నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు (raghurama krishnamraju) వేసిన పిటిషన్ ను ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.
చింతామణి నాటకం నిషేధాన్ని సమర్థిస్తూ ఆర్యవైశ్య సంఘాల తరఫున 3 ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ ఇంప్లీడ్ పిటిషన్లపై ధర్మాసనం విచారణ జరిపింది. ఈ క్రమంలోనే ఇంప్లీడ్ పిటిషన్ల దాఖలుపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. విచారణను సాగదీసేందుకే ఇంప్లీడ్ పిటిషన్లు వేస్తున్నారా? ఇలాగే 100 లేదా 200 పిటిషన్లు వేస్తారా? అని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. కేవలం సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వేసిన ఇంప్లీడ్ పిటిషన్ ను మాత్రమే విచారణకు అనుమతిస్తున్నట్లు హైకోర్టు తెలిపింది.
ఈ సందర్భంగా పిటిషనర్ రఘురామకృష్ణంరాజు తరపున న్యాయవాది ఉమేష్ చంద్ర వాదన వినిపిస్తూ మొత్తం నాటకాన్ని కాకుండా కేవలం అభ్యంతరం ఉన్న పాత్రలను మాత్రమే నిషేధించాలని కోరుతున్నామన్నారు. మొత్తం నాటకాన్ని ఎలా నిషేధిస్తారని న్యాయవాది ప్రశ్నించారు.
కన్యాశుల్కం నాటకంపై అభ్యంతరాలున్నాయని చెబితే మొత్తం నాటకాన్ని నిషేధిస్తారా? అని న్యాయవాది ప్రశ్నించారు. రామాయణంలో అభ్యంతరకర పాత్రలు ఉన్నాయని రామాయణాన్ని నిషేదించమంటే ఎలాగని న్యాయవాది ఉమేష్ చంద్ర వాదించారు. 100 సంవత్సరాల నుంచి ప్రదర్శిస్తున్న నాటకాన్ని ఎలా నిషేధిస్తారని ఆయన ప్రశ్నించారు.
ఆర్టిస్టుల తరుపున న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వేసిన పిటిషన్ కూడా ప్రధాన న్యాయమూర్తి బెంచ్ కి బదిలీ చేసారు. ప్రతివాదులకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. అనంతరం విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది న్యాయస్థానం.
చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి పాత్ర ప్రధానమైనది. ఆయన ఓ వైశ్యుడు. స్త్రీ వ్యామోహంలో పడి డబ్బు ఎలా పోగొట్టుకున్నాడు. అయితే ఈ పాత్ర ద్వారా తమ మనోభావాలు దెబ్బతీస్తున్నారని ఆర్య వైశ్యులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్యవైశ్యుల విజ్ఞప్తి మేరకు ఏపీ సర్కార్ చింతామణి నాటక ప్రదర్శనను నిషేదిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎక్కడా చింతామణి నాటకాన్ని ప్రదర్శించకుడదని ఆదేశాలు జారీ చేసింది.
తెలుగు నాట ప్రసిద్ధి చెందిన సాంఘిక నాటకం చింతామణి. 20వ దశాబ్దంలోని మూడో దశకంలోని సామాజిక సమస్యల ఆధారంగా కవి కాళ్లకూరి నారాయణరావు ఈ నాటకాన్ని రచించారు. ఈ నాటకం ఇప్పటికీ ఊరూరా ప్రదర్శితమవుతూనే ఉంటుంది. ఇది వేశ్యావృత్తి దురాచారాన్ని ఖండించే నాటకం. ఈ నాటకాన్ని తొలిసారి బందరు రామమోహన నాటక సంఘం వారు ప్రదర్శించారు. 1923 నాటికే సుమారు 446 సార్లు దేశమంతా ప్రదర్శింపబడింది. అలాంటిది ఈ నాటకాన్ని రాష్ట్రంలో నిషేధించడంతో సర్వత్రా చర్చ జరుగుతోంది.