AP News: జగన్ సర్కార్ కు హైకోర్టులో చుక్కెదురు... చంద్రబాబు పథకంపై విజిలెన్స్ విచారణ నిలుపుదల

Arun Kumar P   | Asianet News
Published : Apr 08, 2022, 09:39 AM ISTUpdated : Apr 08, 2022, 09:58 AM IST
AP News: జగన్ సర్కార్ కు హైకోర్టులో చుక్కెదురు... చంద్రబాబు పథకంపై విజిలెన్స్ విచారణ నిలుపుదల

సారాంశం

గతంలో టిడిపి ప్రభుత్వ హయాంలో నీరు-చెట్టు పథకం కింద చేపట్టిన పనుల్లో అవతవకలు జరిగాయంటూ జగన్ సర్కార్ విజిలెన్స్ విచారణకు ఆదేశించగా... తాజాగా ఈ విచారణపై హైకోర్టు స్టే విధించింది. 

అమరావతి: ఏపీ హైకోర్టు (ap high court)లో జగన్ సర్కార్ కు మరోసారి చుక్కెదురయ్యింది. గతంలో టిడిపి ప్రభుత్వం హయాంలో చేపట్టిన నీరు-చెట్టు (neeru chettu) పథకంలో రాష్ట్రవ్యాప్తంగా అవకతవకలు, అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసిపి (ysrcp) ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ఈ విజిలెన్స్ విచారణ (vigilence inquiry)ను హైకోర్టు సస్పెండ్ చేసింది. 

నీరు-చెట్టు కింద చేసిన పనులకు బిల్లులు చెల్లించకుండా ఇలా విజిలెన్స్ విచారణకు ఆదేశించడాన్ని సవాల్ చేస్తూ చిన్న వెంకటేశ్వర్లు అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. పిటిషనర్ తరపున న్యాయవాది నర్రా శ్రీనివాస్ వాదనలు వినిపించారు. రాష్ట్ర జలవనరుల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పనులు జరిగినట్లు ఆమోదం తెలిపారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు పిటిషనర్ న్యాయవాది. గతంలోనే పనుల నాణ్యతను ఇంజనీర్లు రికార్డులు కూడా నమోదు చేసారని తెలిపారు. 

అయితే పనులు జరిగిన మూడేళ్ల తర్వాత కూడా బిల్లులు చెల్లించకుండా 2021 అక్టోబర్ లో విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తూ మెమోలు జారీ చేసారని న్యాయవాది తెలిపారు. పిటిషనర్ చేసిన పనులకు బిల్లలు చెల్లించకుండా వుండేందుకే ఇలా విజిలెన్స్ విచారణ పేరిట కాలయాపన చేస్తున్నారని న్యాయవాది తెలిపారు. కాబట్టి వెంటనే ఈ విచారణను ఆపేలా ఆదేశించి పిటిషనర్ కు బిల్లులు చెల్లించేలా చూడాలని న్యాయవాది నర్రా శ్రీనివాస్ కోర్టును కోరారు. 

ఇక ఇప్పటికే ప్రభుత్వ వాదనను కోర్టుముందు వుంచగా తాజాగా న్యాయస్థానం దాన్ని తోసిపుచ్చింది. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనతో ఏకీభవించిన జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు నీరు-చెట్టు పథకంపై ఆదేశించిన విజిలెన్స్ విచారణను సస్పెండ్ చేసారు.  ఈ మేరకు హైకోర్టు మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.  

గతంలో టిడిపి (tdp) ప్రభుత్వ హయాంలో నీరు-చెట్టు పథకం కింద ఒకే రకమైన పనులకు వివిధ శాఖల ద్వారా వేరువేరుగా చూపించి బిల్లులు పొందారని వైసిపి ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇలా  టిడిపి నేతలు వేలకోట్ల అక్రమాలకు పాల్పడినట్లు తమకు ఫిర్యాదులు అందాయంటూ జగన్ సర్కార్ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఈ అవతవకలపై గతేడాది చివర్లో విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. 

2015-19 సంవత్సరాల మధ్యకాలంలో రాష్ట్రంలో జరిగిన ఉపాధి హామీ పనుల్లో 80శాతం పనులు నీరు-చెట్టుకు అనుబందంగా చేపట్టినట్లు పేర్కొంటూ టిడిపి నాయకులు బిల్లులు పొందారని ఆరోపించారు. చివరకు వాగులు, చెరువుల్లో పూడికతీత పనులను కూడా నీరు-చెట్టు కింద చేసినట్లు చూపించారని అటున్నారు. ఇలా జలవనరులు, అటవీ శాఖ ద్వారా వేలకోట్ల రూపాయల పనులు చేపట్టినట్లు చూపించి బిల్లులు పెట్టుకుని అక్రమాలకు పాల్పడినట్లు వైసిపి ప్రభుత్వం ఆరోపించింది. 

ఇలా నీరు-చెట్టు కింద చేపట్టిన పనుల్లో టిడిపి నాయకుల అవినీతిని బయటపెట్టడానికంటూ  విజిలెన్స్ విచారణకు వైసిపి ప్రభుత్వం ఆదేశించింది. అయితే తాము చేసిన పనులకు సంబంధించిన బిల్లులను చెల్లించకుండా ఆపేందుకే వైసిపి ప్రభుత్వం ఇలా విజిలెన్స్ విచారణ పేరిట నాటకాలాడుతోందని కొందరు కోర్టును ఆశ్రయించారు.  హైకోర్టు కూడా పిటిషనర్ల వాదనతో ఏకీభవించి విజిలెన్స్ విచారణను నిలిపివేస్తూ మద్యంతర ఉత్తర్వులిచ్చింది. . 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!