రాజధాని తరలింపు... మేం జోక్యం చేసుకోమని తేల్చేసిన ఏపీ హైకోర్టు

By telugu teamFirst Published Jan 10, 2020, 10:28 AM IST
Highlights

రాజధాని తరలింపుపై అత్యవసరంగా విచారణ జరపాలని లాయర్ సుబ్బారావు హైకోర్టును అభ్యర్థించారు. అయితే హైకోర్టు మాత్రం సుబ్బారావు అభ్యర్థనను తోసిపుచ్చింది.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మూడు  రాజధానుల సెగ బాగానే రాజుకుంది. అమరాతి నుంచి  రాజధానిని తరలించవద్దంటూ రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా...ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తేల్చి చెప్పింది. రాజధానిపై ఏపీ ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని... అందువల్ల తాము దీనిపై జోక్యం చేసుకోలేమని వెల్లడించింది.

రాజధాని తరలింపుపై అత్యవసరంగా విచారణ జరపాలని లాయర్ సుబ్బారావు హైకోర్టును అభ్యర్థించారు. అయితే హైకోర్టు మాత్రం సుబ్బారావు అభ్యర్థనను తోసిపుచ్చింది. రాజధాని తరలింపుపై ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు ఇవ్వలేదని పైగా విధానపరమైన నిర్ణయం కూడా ప్రకటించలేదని.. అలాంటప్పుడు దీనిపై ఎలా జోక్యం చేసుకోగలమని పిటిషనర్ను  హైకోర్టు ప్రశ్నించింది.

రాజధాని తరలించేందుకు ప్రభుత్వం నిర్ణయించినా అది ఒక్క రోజులో పూర్తయ్యే ప్రక్రియ కాదని, అందువల్ల ఈ విషయంలో అత్యవసర విచారణ జరపాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. 

ఈ మేరకు హైకోర్టు చీఫ్ జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, జస్టిస్ మంథాట సీతారామమూర్తి లతో కూడిన బెంచ్ గురువారం విచారణ చేపట్టి.. పిటిషనర్ సుబ్బారావు దాఖలు చేసిన పిటిషన్ తోపాటు ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు హైకోర్టు బెంచ్ ప్రకటించింది. ఇదే క్రమంలో అమరావతి తరలింపు ద్వారా స్టేక్ హోల్డర్స్ ఎవరైనా నష్టపోతే పిటిషన్ వేసుకోవాలని సూచించింది. సంక్రాంతి సెలవుల తర్వాత ఎవరైనా పిటిషన్ వేయొచ్చని స్పష్టం చేసింది.
 

click me!