అమరావతి మాస్టర్ ప్లాన్‌లో మార్పులు, పేదల ఇళ్ల కోసం ప్రత్యేక జోన్.. నోటిఫికేషన్​ విడుదల

By Siva KodatiFirst Published Oct 28, 2022, 10:03 PM IST
Highlights

రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్‌లో ఏపీ ప్రభుత్వం మార్పులు చేసింది. పేదల ఇళ్ల కోసం ఆర్ 5 జోన్ పేరిట ప్రత్యేక జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. రాజధానిలోని 5 గ్రామాల పరిధిలోని 900.97 ఎకరాలను పేదల ఇళ్ల కోసం జోనింగ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపింది.
 

ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో పేదల ఇళ్ల కోసం ప్రత్యేక జోన్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్ ఇచ్చింది. సీఆర్డీఏ సమర్పించిన ప్రతిపాదనల మేరకు ఆర్ -5 జోన్ పేరిట పేదల ఇళ్ల కోసం ప్రత్యేక జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. రాజధానిలోని 5 గ్రామాల పరిధిలోని 900.97 ఎకరాలను పేదల ఇళ్ల కోసం జోనింగ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపింది.

మంగళగిరి మండలంలోని కృష్ణాయాపాలెం, నిడమర్రు, కురగల్లు గ్రామాల్లో .. తుళ్లురు మండలంలోని మందడం,  ఐనవోలు గ్రామాల్లో ఆర్ -5 జోనింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్ లో మార్పు చేర్పులు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జోనింగ్ లో మార్పు చేర్పులపై అభ్యంతరాలు, సూచనలు సలహాలు 15 రోజుల్లోగా తెలియచేయాలని స్పష్టం చేసింది. అక్టోబరు 28 తేదీ నుంచి నవంబరు 11 తేదీ వరకూ 15 రోజుల పాటు సీఆర్డీఏకి అభ్యంతరాలుంటే చెప్పాలని సర్కార్ సూచించింది.

ALso REad:కోర్టు మొట్టికాయలు.. అయినా దొడ్డిదారిలో జగన్ ఆర్డినెన్స్, అమరావతి భూములను కొట్టేసేందుకే : ఏలూరి సాంబశివరావు

కాగా... అమరావతిలో ఇతర ప్రాంతాల పేదలకు ఇళ్ల స్థలాలను ఉద్దేశించిన దస్త్రానికి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గత గురువారం ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. పేదలకు స్థలాలు ఇచ్చే సీఆర్‌డీఏ, ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చట్టాల సవరణకు గవర్నర్ అంగీకారం తెలిపారు. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ఈ చట్టాలకు జగన్ ప్రభుత్వం సవరణలు ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.

తాజాగా ఇప్పుడు గవర్నర్ ఆమోదం లభించడంతో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపుకు మార్గం సుగమమైంది. అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలను కేటాయించేలా చట్ట సవరణను చేశారు. దీని వల్ల రాజధాని అమరావతి ప్రాంతంలోని వారికే కాకుండా... ఇతర ప్రాంతాల వారికి కూడా ఇక్కడే ఇళ్ల స్థలాలను కేటాయించేందుకు అవకాశం లభిస్తుంది. ఈమేరకు రాజధాని మాస్టర్ ప్లాన్‌లో మార్పులు, చేర్పులు చేసేందుకు ప్రభుత్వానికి వెసులుబాటు కలుగుతుంది. 

click me!