పేపర్ లీక్‌పై ప్రచారం వికటించింది, చివరికి వాళ్లే.. రికార్డుల కోసమే ఇలా : నారాయణ అరెస్ట్‌పై సజ్జల కామెంట్స్

By Siva KodatiFirst Published May 10, 2022, 5:05 PM IST
Highlights

పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంలో మాజీ మంత్రి , టీడీపీ నేత నారాయణ అరెస్ట్‌‌ అయిన సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. అధికారులకు స్వేచ్ఛ ఇవ్వడం వల్లే నారాయణ దొరికారని ఆయన వ్యాఖ్యానించారు.
 

నారాయణ విద్యాసంస్థల (narayana educational institutions) పర్యవేక్షణలోనే మాల్ ప్రాక్టీస్ జరిగిందని ఆరోపించారు ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ (ysrcp) నేత సజ్జల  రామకృష్ణారెడ్డి (sajjala rama krishna reddy)  . మాజీ మంత్రి నారాయణ అరెస్ట్‌పై (narayana arrest) మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... గత ప్రభుత్వం ఇలాంటి అంశాలను పట్టించుకోలేదని మండిపడ్డారు. పేపర్ లీకేజ్‌పై (ssc question paper leake)  తీగ లాగితే నారాయణ డొంక కదిలించిందని ఆయన దుయ్యబట్టారు. ఇలాంటి వ్యక్తిని చంద్రబాబు నాయుడు మంత్రిగా కొనసాగించారని.. ఉపాధ్యాయ వ్యవస్థకే మచ్చతెచ్చేలా వ్యవహారించారని సజ్జల ఎద్దేవా చేశారు. ప్రస్తుత ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడంతో తప్పు బయటపడిందని రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. 

చట్టం ఎవరి విషయంలోనైనా సమానంగా పనిచేస్తుందని సజ్జల స్పష్టం చేశారు. ప్రభుత్వం దృష్టిలో ఎవరైనా ఒక్కరేనని రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. తప్పు చేశారని తేలడం వల్లే వైఎస్ కొండారెడ్డిని అరెస్ట్ చేశారని సజ్జల వెల్లడించారు. అధికారులకు స్వేచ్ఛ ఇవ్వడం వల్లే నారాయణ దొరికారని ఆయన వ్యాఖ్యానించారు. రికార్డుల పేరుతో నారాయణ తప్పుడు విధానాలకు పాల్పడ్డారని .. పేపర్ లీక్‌పై ఏదో ప్రచారం చేయాలని చూస్తే వికటించి వాళ్లకే తగిలిందని సజ్జల ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

వందకు 120 మార్కులు తెచ్చుకునే విధంగా వ్యవహరించారని.. కాపీయింగ్‌ను ఆర్గనైజ్డ్ క్రైమ్‌గా నారాయణ చేయించారని రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఏ విషయంలోనైనా నిస్సిగ్గుగా వ్యవహరించడం చంద్రబాబు (chandrababu naidu) నైజమని ఆయన దుయ్యబట్టారు. సీఎం వైఎస్ జగన్ పాలనలో తప్పును ఉపేక్షించే పరిస్ధితి లేదని రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థకు కొద్దిమంది చీడలాగా తయారయ్యారని ఆయన మండిపడ్డారు. పేపర్ మాల్ ప్రాక్టీస్ కల్చర్ నారాయణ, శ్రీచైతన్య సంస్థల నుంచే వచ్చాయని సజ్జల పేర్కొన్నారు. 

తప్పు చేస్తే ఎవరినీ వదలొద్దని సీఎం జగన్ (ys jagan) ఆదేశించారని రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. టీడీపీ నేతలు అడ్డగోలు వాదనలను ప్రజలు నమ్మే పరిస్ధితి లేదన్నారు. నారాయణ తప్పు చేశారని ఇప్పటికే వెల్లడయ్యిందని.. ప్రాథమిక సాక్ష్యాధారాలతోనే నారాయణను అరెస్ట్ చేశారని సజ్జల తెలిపారు. ఈ వ్యవహారంలో పోలీసులు స్వేచ్ఛగా వ్యవహరిస్తారని ఆయన స్పష్టం చేశారు. ఇది కక్ష సాధింపు చర్య కాదని సజ్జల పేర్కొన్నారు. 
 

click me!