
తీవ్ర తుఫాన్ అసని దిశ మార్చుకుంది. గత కొన్ని గంటలుగా బంగాళాఖాతంలో వాయువ్య దిశగా కదిలిన అసని తుఫాన్.. అనుహ్యంగా దిశ మార్చుకుని పశ్చిమ దిశగా కదులుతుంది. దిశ మార్చుకున్న అసని తుఫాన్.. కోస్తాంధ్ర తీరం వైపు దూసుకోస్తుంది. రేపు సాయంత్రంలోగా అసని తుపాన్ తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మచిలీపట్నం సమీపంలో తీరం దాటే సూచనలు ఉన్నాయని తెలిపారు. మచిలీపట్నం వద్ద తీరం తాకనున్న అసని తుఫాన్.. మళ్లీ విశాఖ వద్ద సముద్రంలోకి ప్రవేశిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావంత కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
తీరాన్ని దాటిన తర్వాత తుఫాన్ బలహీన పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కాకినాడ తీరానికి 210 కి.మీ, విశాఖపట్నంకు 310 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయి ఉంది. తీరానికి దగ్గరగా వస్తున్న సమయంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంతేకాకుండా బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. తుఫాన్ తీరం దాటే సమయంలో మరింత వేగంగా గంటకు 90 కి.మీకు పైగా వేగంతో ఈదరుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇప్పటికే కోస్తాంధ్రలో పలుచోట్ల ఈదురుగాలులు వర్షాలు కురుస్తున్నాయి. తీరప్రాంతాల్లో బలమైన గాలులు వీస్తున్నాయి. ఈదురుగాలులకు పలుచోట్ల వృక్షాలు నెలకొరిగాయి. కొన్నిచోట్ల విద్యుత్ వైర్లు తెగిపడంతో ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలతో రైతులు పంటలు కాపాడుకోవడంపై దృష్టి సారించారు.
రానున్న రెండు రోజులు వర్షాలు..
రానున్న రెండు రోజులు.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. పలుచోట్ల 12 నుంచి 20 సెంటీమీటర్ల అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.
కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు..
తుఫాను ముప్పును దృష్టిలో ఉంచుకుని విశాఖపట్నం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ప్రజలు 24 గంట్లో ఎప్పుడైనా టోల్ ఫ్రీ నంబర్లు 0891-2590100, 0891-2590102కు కాల్ చేయవచ్చని చెప్పారు. తుఫాన్ నేపథ్యంలో మరో రెండు రోజుల పాటు అధికారులు మూడు షిఫ్టుల్లో పని చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల వరకు, రాత్రి 8 నుంచి ఉదయం 8 గంటల వరకు మూడు షిఫ్టుల్లో సిబ్బంది మంగళవారం, బుధవారాల్లో కంట్రోల్ రూమ్‌లో పని చేస్తారని చెప్పారు. రెవెన్యూ, ఎస్‌ఎంఐ, ఆర్‌డబ్ల్యూఎస్, మెడికల్, ఫిషరీస్, ఎలక్ట్రికల్ విభాగాల నుంచి ఒక్కొక్కరి చొప్పున ఆరుగురిని ఒక్కో షిఫ్టులో కంట్రోల్ రూంలో కలెక్టర్ నియమించారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల కలెక్టర్లు కూడా పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇక, రాజమహేంద్రవరం జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్‌కు 8977395609 నెంబరు కేటాయించారు.
ఇక, బలమైన గాలుల కారణంగా విశాఖపట్నం విమానాశ్రయంలో ముందుజాగ్రత్త చర్యగా విమానాల రాకపోకలను నిలిపివేశారు. అసాని కారణంగా ఈదురుగాలులు వీస్తుండడంతో సోమవారం మధ్యాహ్నం నుంచి విశాఖపట్నం రావలసిన పలు విమానాలను రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. విశాఖ విమానాశ్రయానికి రావాల్సిన 10 విమానాలు రద్దయ్యాయని, 7 విమానాలను మళ్లించామని ఎయిర్‌పోర్టు డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. విశాఖలో వాతావరణం అనుకూలించకపోవడంతో రెండో రోజు కూడా పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి.
తుఫాన్ నేపథ్యంలో తూర్పు కోస్తా రైల్వే జోన్, వాల్తేరు డివిజన్ అధికారులు అప్రమత్తమయ్యారు. ట్రాక్‌లు దెబ్బతిని ప్రమాదాలు సంభవించకుండా ప్రత్యేక బృందాల్ని రంగంలోకి దించారు. భారీ వర్షం కారణంగా రైలు ట్రాఫిక్, రైల్వే ట్రాక్‌లు ప్రభావితమైతే త్వరగా పునరుద్ధరించడానికి రైల్వే అధికారులు సిబ్బందిని అందుబాటులో ఉంచారు.