స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకురండి...: పోస్కో సంస్థకు జగన్ సర్కార్ లేఖ

By Arun Kumar PFirst Published Mar 1, 2021, 9:28 AM IST
Highlights

 గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు రావాలని రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికల్ వలన్ పోస్కో ఇండియా సీఎండికి లేఖ రాశారు. 

అమరావతి: నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు రావాలని సౌత్ కొరియాకు చెందిన పోస్కో స్టీల్ సంస్థను కోరింది ఏపీ సర్కార్. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకొస్తే పూర్తి స్థాయి సహకారం అందించేందుకి సిద్దంగా ఉన్నామంటూ ప్రభుత్వం పోస్కో సంస్థకు లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికల్ వలన్ పోస్కో ఇండియా సీఎండికి లేఖ రాశారు. 

ఇదిలావుంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు చెందిన మిగులు భూముల్లో గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్‌ ఏర్పాటుకు సౌత్ కొరియాకు చెందిన పోస్కో స్టీల్ ఆసక్తి చూపిస్తోంది. ఈ విషయాన్ని ఇటీవల పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం తెలిపింది. లోక్ సభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాత పూర్వకంగా సమాధానమిచ్చారు. ఈ మేరకు పోస్కో ఆర్ఐఎస్ఎల్ మధ్య 2019 అక్టోబర్‌లో న్యాయపరంగా కట్టుబాట్లు లేని ఎంవోయూ కుదిరినట్లు చెప్పారు.

ఎంఓయూ ప్రకారం కొత్తగా ఏర్పాటు చేయబోయే స్టీల్ ప్లాంట్‌లో 50 శాతం వాటా తమకు ఉండాలని పోస్కో స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. పోస్కో- హ్యుండయ్ సంయుక్త బృందం 2018 అక్టోబర్ 22న విశాఖలోని ఆర్ఐఎస్ఎల్ స్టీల్ ప్లాంట్‌ను సందర్శించిందన్నారు ధర్మేంద్ర ప్రధాన్. 

read more    వాళ్లు నన్ను కలిసిన మాట వాస్తవమే.. కానీ: పోస్కోపై జగన్ స్పష్టత

పోస్కో ప్లాంట్‌ ఏర్పాటుకు ఇప్పటికే జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటైందని ఆయన వెల్లడించారు. కొత్త ప్లాంట్‌లో పోస్కో వాటా 50 శాతం వుందని ధర్మేంద్ర చెప్పారు. ఇప్పటి దాకా ఒప్పందం వివరాలు రహస్యమని.. 2019 నుంచి ఇప్పటి వరకు 3 సార్లు పోస్కో బృందం స్టీల్ ప్లాంట్‌ను సందర్శించిందని కేంద్ర మంత్రి వెల్లడించారు. 2019 జూలై, సెప్టెంబర్‌, 2020లోనూ ఆర్ఐఎస్ఎల్‌ను పరిశీలించిందని ప్రధాన్ వెల్లడించారు. 

అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆంధ్ర ప్రదేశ్ లో ఉద్యమాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వైజాగ్ వాసులు, స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ రోడ్డెక్కారు. ఇక అధికార వైసిపితో పాటు ప్రతిపక్షాలన్నీ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోడానికి ఉద్యమించడానికి సిద్దమయ్యారు. 

click me!