తమకు ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఏపీ గవర్నర్ ను కోరారు ఉద్యోగ సంఘాల నేతలు
అమరావతి:వేతన బకాయిలపై ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు గురువారం నాడు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు చేశారు. ఎనిమిది ఉద్యోగ సంఘాల నేతలు ఏపీ గవర్నర్ తో భేటీ అయ్యారు.జీపీఎఫ్, మెడికల్ బిల్లులు , డీఏలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిల చెల్లింపులో జోక్యం చేసుకోవాలని గవర్నర్ ను ఉద్యోగ సంఘాల నేతలు కోరారు. ఈ మేరకు గవర్నర్ కు వినతి పత్రం సమర్పించారు.
ఉద్యోగులకు రావాల్సిన ఆర్ధిక ప్రయోజనాలు స్థంభించాయని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపించారు. తమ ను రక్షించాలని గవర్నర్ కు మొరపెట్టుకున్నామని ఆయన చెప్పారు. ఉద్యోగులకు న్యాయబద్దంగా చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరారు. ఉద్యోగులకు బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వమే చట్టాలను అతిక్రమిస్తుందని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపించారు.
తమ వేతన బకాయిలను చెల్లించాలని పలుమార్లు కోరినా కూడా సీఎంఓ అధికారులు స్పందించడం లేదని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు.ప్రభుత్వం నాలుగు స్థంభలాట ఆడిస్తుందని ఉద్యోగ సంఘాల నేతలు విమర్శించారు.తమ బకాయిల విషయమై కాగ్ కు కూడా ఫిర్యాదు చేసినట్టుగా ఉద్యోగ సంఘాల నేతలు చెప్పారు. అవసరమైతే న్యాయ సలహా తీసుకొని ప్రభుత్వంపై కేసు కూడా పెడతామని ఉద్యోగ సంఘాల నేతలు హెచ్చరించారు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే ఏప్రిల్ నుండి ఆందోళనలు నిర్వహిస్తామని కూడా ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించారు.