ఒక్కసారి కూడా గెలవనివాళ్లు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం హాస్యాస్పదం: లోకేశ్, పవన్‌లపై కొడాలి నాని విమర్శలు

By Mahesh KFirst Published Jan 3, 2023, 7:08 PM IST
Highlights

ఒక్కసారి కూడా ఎన్నికల్లో గెలువనివాళ్లు కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారని, ఇది హాస్యాస్పదంగా ఉన్నదని మాజీ మంత్రి కొడాలి నాని.. నారా లోకేశ్, పవన్ కళ్యాణ్‌లపై విమర్శలు సంధించారు. అంతేకాదు, తాము పేదల అభివృద్ధికి పాటుపడుతుంటే వారు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
 

అమరావతి: అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కసారి కూడా గెలువని నారా లోకేశ్, పవన్ కళ్యాణ్‌లు పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం హాస్యాస్పదంగా ఉన్నదని మాజీ మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. వీరిద్దరూ ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలయ్యారని పేర్కొన్నారు. అదే విధంగా ఆయన టీడీపీపై విమర్శలు ఎక్కుపెట్టారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబునాయుడు కేవలం ఒక సామాజిక వర్గానికి మాత్రమే కొమ్ముకాసేవాడని ఆరోపణలు చేశారు. ఆ సామాజిక వర్గానికి మాత్రమే పదువులు కేటాయించాడని విమర్శించారు. 

మాజీ మంత్రి కొడాలి నాని గుడివాడలో మంగళవారం నిర్వహించిన నియోజకవర్గ సచివాలయ సమన్వయకర్తలు, వాలంటీర్ల సమీక్షా సమావేశంలో పాల్గొని ఈ విమర్శలు చేశారు. టీడీపీ చేసే కుల రాజకీయాలకు భిన్నంగా తమ ప్రభుత్వం అన్ని వర్గాలను ఆదరిస్తున్నదని అన్నారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్ని వర్గాలను తన వారే అని సంబోధిస్తారని తెలిపారు. ‘నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా ముస్లిం వర్గాలు’ అని, అందరూ తనవారిగానే ఆయన పిలుచుకుంటారని వివరించారు. అందరినీ తనవారే అని పిలుచుకోవడానికి ఉన్న గట్స్ కేవలం జగన్‌కే ఉన్నాయని తెలిపారు. 

వెనుకబడిన అన్ని వర్గాల ప్రజలకు పదవులు కేటాయించిన ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమే అని పేర్కొన్నారు. పిల్లలందరికీ నాణ్యమైన విద్య అందించడానికి తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే ప్రతిపక్షాలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శలు కురిపించారు. ప్రతి స్కూల్‌లో ఇంగ్లీష్ మీడియం మాధ్యమాన్ని పిల్లలకు అందించాలని తాము ప్రయత్నిస్తున్నామని, కానీ, వాళ్లు మాత్రం వారి పిల్లలు మాత్రమే ఇంగ్లీష్ మీడియం చదివితే చాలు అన్నట్టుగా కోర్టుల్లో కేసులు వేస్తున్నారని ఫైర్ అయ్యారు. తాము పేదలకు మేలు చేస్తుంటే, వారి అభివృద్ధికి దోహదపడుతుంటే.. వారు ఎల్లో మీడియాలో పెన్షన్ దారులకు షాక్.. రైతులకు షాక్ అని డిబేట్లు పెడుతున్నారని మండిపడ్డారు. ఈనాడు రామోజీరావు, ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ 5 బీఆర్ నాయుడులకు మానసిక వైకల్యం ఉన్నదని ఆరోపించారు.

click me!