
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిందంటూ ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. వైసిపి పాలనలో రాష్ట్ర ఆర్థిక దిగజారడం కాదు మరింత పటిష్టంగా తయారయ్యిందని... ఇందుకు గడచిన నాలుగేళ్లుగా పన్ను వసూళ్లు పెరగడమే నిదర్శనమని అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల గణాంకాలను చూస్తే 'జీఎస్టీ'లో ఏపీ అగ్రస్థానంలో వుందని మంత్రి బుగ్గన తెలిపారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు పాలించడం రాదు... ఏపీకి ఆదాయం లేదంటూ విపక్షాలు బాధ్యతారాహిత్యంగా విమర్శలు చేయడం తగదని ఆర్థిక మంత్రి సూచించారు. వైసిపి ప్రభుత్వానికి పాలించడం రాకపోతే గత నాలుగేళ్లలో పన్నుల వసూళ్లు ఎలా పెరుగుతాయని ప్రశ్నించారు. సెంట్రల్ జీఎస్టీతో పోలిస్తే రాష్ట్ర జిఎస్టి 4శాతం అధికంగా వుందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుతున్న చంద్రబాబు, యనమలతో బహిరంగ చర్చకు సిద్దం... వారు సిద్దమా అని బుగ్గన సవాల్ విసిరారు.
ఇక ఏపీలో రోడ్లు, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలపై కావాలనే ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని బుగ్గన అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్నిప్రాంతాల్లో రహదారులు బాగానే వున్నాయి... కానీ ఎక్కడో దెబ్బతిన్న రోడ్లను చూపించి ఏపీలో రోడ్లన్నీ ఇలాగే వున్నాయంటూ ప్రతిపక్షాలు, మీడియా ప్రచారం చేస్తోందన్నారు. గత ప్రభుత్వాల కంటే ఎక్కువగానే రహదారుల నిర్మాణానికి జగన్ సర్కార్ ఖర్చు చేస్తోందని బుగ్గన వెల్లడించారు.
Read More వ్యాన్ ను చూసుకొని మురిసిపోతున్నారు: పవన్ కళ్యాణ్ పై జగన్ సెటైర్లు
ఇక ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సమయానికి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం వుందని మరో దుష్ప్రచారం జోరుగా జరుగుతోందని ఆర్థిక మంత్రి అన్నారు. పలు కారణాలతో ఎప్పుడో ఒకసారి ఉద్యోగులకు వేతనాలు ఆలస్యం అయ్యాయి... దీన్ని పట్టుకుని ప్రతినెలా ఇదే పరిస్థితి వున్నట్లుగా ప్రచారం చేస్తున్నారని అన్నారు. కోవిడ్ కష్టకాలంలోనూ సామాజిక పెన్షన్లు ఆలస్యం కాలేదు... అలాంటిది ఇప్పుడు ఆదాయం పెరిగాక కూడా ఆలస్యంగా ఎలా వేస్తామని అన్నారు.
ఇక వైసిపి ప్రభుత్వం ప్రజలకు పథకాలు ఇస్తే ఉచితాలు అంటున్నారు... మరి అధికారంలోకి వస్తే టీడీపీ అమలుచేస్తామంటున్న పథకాలు ఉచితాలు కావా? అని మంత్రి ప్రశ్నించారు. తమకంటే ఎక్కువ ఇస్తామని ఇప్పుడు చెబుతున్నారు..మేం ప్రజలకు నేరుగా ఇస్తే ఉచితం, మీరిస్తే సముచితమా? అని మంత్రి బుగ్గన నిలదీసారు.
ఎన్నో కీలక సంస్కరణలతో పన్నుదారులకు అన్నివిధాలుగా ప్రభుత్వం అండగా వుంటోందని... అందువల్లే పన్నువసూలులో రాష్ట్రం ముందంజలో వుందన్నారు బుగ్గన. గత ఆర్థిక సంవత్సరం 2021-22లో రూ.23,386 కోట్లు పన్నుల రూపంలో వసూలయితే ఈ ఆర్థిక సంవత్సరం 2022-23లో రూ.28,103 కోట్లు వసూలయ్యాయని అన్నారు. వాణిజ్య పన్నుల శాఖలో సంస్కరణలు, పన్ను చెల్లింపుదారులతో ఫ్రెండ్లీ విధానాలే ఆదాయం పెంపుకు కారణమని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు.