బాబు బంధుమిత్ర గణానికి రాజధానిలో 4 వేల ఎకరాలు: బుగ్గన

By sivanagaprasad KodatiFirst Published Dec 17, 2019, 4:53 PM IST
Highlights

రాజధాని పరిసర ప్రాంతాల్లో చంద్రబాబు తనకు కావాల్సిన వారికి 4 వేల ఎకరాలకు పైగా కేటాయించారని బుగ్గన పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అమరావతికి సంబంధించి వాడి వేడి చర్చ జరిగింది. ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. రాజధాని పరిసర ప్రాంతాల్లో చంద్రబాబు తనకు కావాల్సిన వారికి 4 వేల ఎకరాలకు పైగా కేటాయించారని బుగ్గన పేర్కొన్నారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా మిగిలిందన్నారు.

13 జిల్లాల్లో ఏడున్నర జిల్లాలు బాగా వెనుకబడిన ప్రాంతాలని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. విభజన తర్వాత బాధ్యతలు చేపట్టిన కొత్త ప్రభుత్వానికి మొదటి ఐదేళ్లు కీలకమైనదని బుగ్గన తెలిపారు.

క్యాన్సర్‌తో బాధపడుతూ కూడా శివరామకృష్ణన్ 10 జిల్లాల్లో పర్యటించి తయారుచేసిన నివేదికను చంద్రబాబు ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టలేదని ఆయన మండిపడ్డారు. శివరామకృష్ణన్, రవిచంద్రన్ వంటి నిపుణులు రూపొందించిన నివేదికను పక్కనపెట్టి.. చంద్రబాబు నాయుడు నారాయణ కమిటీ వేశారని తెలిపారు.

రాజధానిని ఎక్కడ పెట్టాలనే దానిపై 5 కోట్ల మంది ఆంధ్రుల్లో 1400 మంది ఫోన్‌లో తెలిపిన అభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకుని అమరావతిని ఎంపిక చేయడం భావ్యమా అని ఆయన ప్రశ్నించారు. పక్క రాష్ట్రం రాజకీయాల్లో వేలు పెట్టి అమరావతికి పారిపోయి వచ్చి ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని బుగ్గన వెల్లడించారు. 

ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టాల్సిన రాజధానిని ఒక వ్యాపార సంస్థను డీల్ చేసినట్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చారని బుగ్గన మండిపడ్డారు. ప్రతిపక్షనేత తన గొప్పలు తానే చెప్పుకుంటూ ఉంటారని... మహిళా ఎమ్మార్వోని టీడీపీ ఎమ్మెల్యే జుట్టు పట్టుకుని ఈడ్చుకెళితే బాబు ఏంచేశారని ప్రశ్నించారు.

కేవలం ప్లాట్లు వేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సింగపూర్ కంపెనీలను రాజధానిలో భాగస్వాములను చేసిందని బుగ్గన ధ్వజమెత్తారు. చంద్రబాబు హైదరాబాద్‌ను కట్టుంటే 400 ఏళ్లనాడు కులీకుతుబ్‌షా ఏం చేసినట్లని మంత్రి ప్రశ్నించారు.

భారతదేశం ఎగుమతి చేసే ఐటీ ఎగుమతుల్లో ఒక్క బెంగళూరు నుంచే 45 శాతం ఉందని... హైదరాబాద్ 12, నోయిడా 14 శాతం, చెన్నై 15, పుణే-ముంబై 15 శాతం వుందని మంత్రి గుర్తుచేశారు. ఎస్ఎం కృష్ణ, యడియూరప్ప, జయలలితలు తాము చేసిన అభివృద్ధిని ఎప్పుడూ చెప్పుకోలేదని రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు.

రహేజా, మైండ్‌స్పేస్ సంస్థలు రియల్ ఎస్టేట్ సంస్థలని.. ఐటీ పరిశ్రమతో వాటికి సంబంధం లేదని చంద్రబాబు సమైక్య రాష్ట్రానికి సీఎంగా ఉన్నప్పుడు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారమే చేశారని బుగ్గన పేర్కొన్నారు. 

 

click me!