హైకోర్టులో ఊరట... ఏపీ ఫైబర్ నెట్ కేసులో అరెస్టైన సాంబశివరావుకు బెయిల్

By Arun Kumar PFirst Published Sep 20, 2021, 1:47 PM IST
Highlights

 ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు హయాంలో చేపట్టిన ఫైబర్ నెట్ వ్యవహారంలో భారీ అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపణలతో అరెస్టయిన అధికారి సాంబశివరావుకు బెయిల్ లభించింది. 

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ఫైబర్‍నెట్ కేసులో  సీఐడీ అరెస్ట్ చేసిన ఐఆర్ టీఎస్ అధికారి సాంబశివరావుకు బెయిల్ లభించింది. ఈ కేసుపై సోమవారం విచారణ జరిపిన ఏపీ హైకోర్టు సాంబశివరావుకు బెయిల్ మంజూరు చేసింది. 

కేంద్రానికి సమాచారం ఇవ్వకుండా అఖిలభారత సర్వీస్ అధికారి సాంబశివరావును అరెస్ట్ చేయడంపై సీనియర్ న్యాయవాదులు ఆదినారాయణరావు, యలమంజుల బాలజీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా ఆయనపై ఆరోపణలు చేస్తున్నారని న్యాయవాదుల కోర్టుకు తెలిపారు. 

read more  ఏపీ ఫైబర్‌నెట్ స్కాంలో సాంబశివరావు అరెస్ట్.. కోర్టులో హాజరుపరచనున్న సీఐడీ

ఫైబర్ నెట్ కేసులో అరెస్టైన సాంబశివరావు ఆదివారమే ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ తో పాటు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో సాంబశివరావు ఏపీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థ ఎండీగా పనిచేశారు. కేంద్ర సర్వీసుల్లో ఉన్న సాంబశివరావు డిప్యూటేషన్ పై ఏపీలో పనిచేశారు. 

అయితే ఏపీ ఫైబర్ నెట్ లో అక్రమాలు చోటు చేసుకొన్నాయని జగన్ సర్కార్ ఆరోపించింది. ఈ మేరకు సీఐడీ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే సీఐడీ అధికారులు సాంబశివరావును ఈ నెల 18వ తేదీన అరెస్ట్ చేసారు. దీంతో సాంబశివరావు హైకోర్టును ఆశ్రయించారు.

తనపై ఏపీ సీఐడీ తనపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని ఆ పిటిషన్ లో సాంబశివరావు కోరారు. అవినీతి నిరోధక చట్టం కింద అఖిల భారత సర్వీసు అధికారులపై కేసు నమోదు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలని ఆ పిటిషన్ లో సాంబశివరావు గుర్తు చేశారు. 48 గంటల పాటు పోలీసుల నిర్భంధంలో ఉంటే ఆ ఉద్యోగి సస్పెన్షన్ కు గురయ్యేందుకు అవకాశం ఉందని సాంబశివరావు తరపు న్యాయవాది ఆ పిటిషన్ లో కోరారు.

ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా  ఐఆర్ టీఎస్ అధికారి సాంబశివరావుకు బెయిల్ ఇవ్వాలన్న పిటిషనర్ తరపు న్యాయవాది వాదనతో కోర్టు ఏకీభవించింది. దీంతో ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.   

click me!