సింహాచలం, మాన్సాస్‌లలో అక్రమాలు: దేవాదాయ శాఖలో భారీ కుదుపు.. ఒకే రోజు ఇద్దరు అధికారులపై వేటు

By Siva KodatiFirst Published Aug 6, 2021, 8:45 PM IST
Highlights

సింహాచలం దేవస్థానం, మాన్సస్ ట్రస్ట్ ఈవోగా పనిచేసిన సమయంలో రామచంద్రమోహన్‌ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయనను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. 
 

దేవాదాయ శాఖ అడిషనల్ కమీషనర్ రామచంద్రమోహన్‌పై సస్పెన్షన్ వేటు వేసింది ప్రభుత్వం. ఆయనను సస్పెండ్ చేస్తూ జీవో నెం.494 కింద ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. సింహాచలం దేవస్థానం, మాన్సస్ ట్రస్ట్ ఈవోగా పనిచేసిన సమయంలో రామచంద్రమోహన్‌ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని నిర్ధారణ అయ్యింది. మాన్సాస్ భూముల అమ్మకాల్లో రూ.74 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని ప్రభుత్వానికి నివేదిక అందింది. అలాగే సింహాచలం దేవస్థానం ప్రాపర్టీ మార్పులకు సైతం రామచంద్రమోహన్ పాల్పడినట్లు నిర్ధారణ అయ్యింది. డిప్యూటీ కమీషనర్ పుష్పవర్థన్ కమిటీ విచారణలో వాస్తవాలు వెలుగుచూశాయి. విచారణ కమిటీ ప్రాథమిక నివేదిక ఆధారంగా రామచంద్రమోహన్‌ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. 

అలాగే సింహాచలం దేవస్థానం డిప్యూటీ ఈవో సుజాతపైనా ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఆలయ భూ రికార్డుల తారుమారులో సుజాత ప్రమేయం వున్నట్లుగా కమిటీ నిర్ధారించింది. అసిస్టెంట్ కమీషనర్ హోదాలో సుజాత అక్రమాలకు పాల్పడినట్లుగా విచారణ కమిటీ తేల్చింది. సుమారు 860 ఎకరాల ఆలయ భూముల రికార్డులు మారినట్లు గుర్తించారు. విచారణ కమిటీ నివేదిక ఆధారంగా సస్పెన్షన్ ఆదేశాలు జారీ చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

click me!