ఈ పీఆర్సీ మాకు అక్కర్లేదు, అవసరమైతే సమ్మె.. జగన్ ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాలు తిరుగుబాటు

Published : Jan 18, 2022, 01:07 PM ISTUpdated : Jan 18, 2022, 01:18 PM IST
ఈ పీఆర్సీ మాకు అక్కర్లేదు, అవసరమైతే సమ్మె.. జగన్ ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాలు తిరుగుబాటు

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) ప్రకటించిన పీఆర్సీపై ఉద్యోగ సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని ఎదురుచూస్తే వ్యతిరేక జీవోలు విడుదల చేశారని మండిపడ్డారు. 

ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీ వివాదం మళ్లీ మొదటికొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం (Andhra Pradesh Government) ప్రకటించిన పీఆర్సీపై ఉద్యోగ సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని ఎదురుచూస్తే వ్యతిరేక జీవోలు విడుదల చేశారని మండిపడ్డారు. మంగళవారం విజయవాడలో ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి నాయకులు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర చరిత్రలో ఐఆర్‌ కంటే తక్కువ ఫిట్‌మెంట్‌ దాఖలాలు లేవని వారు అన్నారు. అశాస్త్రీయంగా ఇచ్చిన జీవోలను వ్యతిరేకిస్తున్నట్టుగా చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదని అన్నారు. గత ప్రభుత్వాలు ఇచ్చిన రాయితీని ఎత్తివేస్తారా అని ప్రశ్నించారు. రేపు, ఎల్లుండి జరిగే సమావేశాల్లో కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. అవసరమైతే సమ్మె చేపడతామని హెచ్చరించారు. 

ఏపీ అమరావతి జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయ చరిత్రలో ఇది చీకటిరోజు అని అన్నారు. హెచ్‌ఆర్‌ఏ శ్లాబులు, సీసీఏ, పింఛనులపై చర్చే జరగలేదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలు వర్తింపజేస్తారా అని ప్రశ్నించారు. 11వ పీఆర్సీని అమలు చేస్తున్నప్పుడు కేంద్ర పీఆర్సీపై చర్చెందుకు అంటూ ఫైర్ అయ్యారు. తమకు ఇస్తున్న డబ్బుల్లోనూ కోతలు విధిస్తారా అంటూ ప్రశ్నించారు. తమకు రావాల్సిన డీఏలను అడ్డుపెట్టుకుని పీఆర్సీ ప్రకటించారని అన్నారు. జీవోలన్నీ రద్దుచేసే వరకు పోరాడతామని వెల్లడించారు. ఈనెల 20న ఇరు ఐకాసల పక్షాన కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు. తమ ఉద్యమాల ద్వారా జరగబోయే అసౌకర్యానికి ప్రభుత్వానిదే బాధ్యత అని హెచ్చరించారు. 

ఏపీ జేఏసీ చైర్మన్‌ బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ... ఇలాంటి పీఆర్సీని తన సర్వీస్‌లో ఇంతవరకు చూడలేదన్నారు. ప్రభుత్వం కుడిచేతితో ఇచ్చి.. ఎడమ చేతితో వసూలు చేస్తోందని విమర్శించారు. ఈ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఏఎస్‌లు రూ. 40 వేలు హెచ్‌ఆర్‌ఏ తీసుకొని తమకు తగ్గించాలని రిపోర్ట్ ఇస్తారా అంటూ మండిపడ్డారు. తమకు ఈ పీఆర్సీ వద్దని, పాత పీఆర్సీ, డిఏలను  కొనసాగించాలని కోరారు.

ఈ పీఆర్సీని ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకొనేది లేదని అన్నారు. పదేళ్లకు ఒకసారి ఇచ్చే పీఆర్సీ మాకు అవసరం లేదని చెప్పారు. పాత పద్ధతిలోనే పీఆర్సీ ఇచ్చేదాకా పోరాడతామని వెల్లడించారు. పీఆర్సీ, హెచ్‌ఆర్‌ఏలో కోతను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టుగా తెలిపారు. రేపు, ఎల్లుండి జరిగే సమావేశాల్లో కార్యాచరణ ప్రకటిస్తామని..అవసరమైతే సమ్మె చేసేందుకూ వెనుకాడమని ఆయన తెలిపారు. 

ఇక, ఏపీ ప్రభుత్వం.. కొత్త వేత‌న స‌వ‌ర‌ణ ఉత్తర్వులు సోమవారం వ‌రుస పెట్టి జారీ చేసింది. అయితే  ఇంటి అద్దె విష‌యంలో ఉద్యోగుల‌కు నిరాశే ఎదురైంది. అలాగే, ఇప్ప‌టి నుంచి ప‌దేండ్ల‌కు ఒక‌సారే వేత‌న స‌వ‌ర‌ణ‌లు చేయ‌నున్న‌ట్టు ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. అశుతోష్‌ మిశ్ర కమిటీ సిఫార్సులనూ పరిగణనలోకి తీసుకోకుండా సీఎస్‌ కమిటీ సూచనల మేరకే ఉత్తర్వులు జారీ చేస్తూ.. ఇంటి అద్దె భత్యంలో కోత విధించింది. ఇప్పటికే  ఐఆర్‌  27శాతం కంటే తక్కువ ఫిట్‌మెంట్‌ (23.29 శాతం) ప్రకటించిన సర్కారు... ఇప్పుడు హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ, డీఏల్లోనూ తమకు షాక్ ఇచ్చిందని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో నేటి నుంచే కొన్ని ఉద్యోగ సంఘాలు నిరసన బాట పట్టాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

YS Jagan Sensational Comments: మేము అధికారంలోకి వస్తే వాళ్లందరూ జైలుకే | Asianet News Telugu
డ్రెయిన్స్ పొల్యూషన్ లేకుండా చెయ్యండి:Chandrababu on Make Drains Pollution Free| Asianet News Telugu